ఉదయం నుంచే ఉరుకులు.. పరుగులు.. రోడ్లపై రయ్‌మనేలా వెళ్తున్న వాహనాలు.. సాయంత్రం దాకా తెరుచుకున్న దుకాణాలు.. హారన్‌ల మోతలతో కరీంనగర్ మళ్లీ పాత పట్టణంగానే కనిపిస్తోంది. ఆరెంజ్ జోన్ పరిధిలో జిల్లా ఉండటం.. కొన్ని సడలింపుల నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్‌లో తెరుచుకున్న దుకాణాలు
By
Published : May 8, 2020, 11:10 AM IST
కరీంనగర్, హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలతోపాటు అన్ని మండల కేంద్రాల్లో రోడ్లు కళకళలాడాయి. ప్రభుత్వం బుధవారం నుంచే ఆయా కేటగిరీల దుకాణాలను తెరుచుకునేందుకు అనుమతిచ్చినా గురువారం నుంచి జిల్లాలో సందడి కనిపించింది. పట్టణాల్లో 50 శాతం దుకాణాలను తెరవాలనేలా జారీ అయిన ఉత్తర్వులకనుగుణంగా నగరపాలక, పురపాలిక సంస్థల్లో సరి, బేసి విధానాన్ని జిల్లాలోని ఐదు పట్టణాల్లో అమలు చేస్తున్నారు. ఇందుకోసం బీ-కేటగిరీ దుకాణాలను క్రమ సంఖ్యలను కేటాయించడంతో వ్యాపార కేంద్రాల సందడి క్రమంగా మొదలైంది. ప్రజలు పెద్దఎత్తున ఆయా అవసరాల నిమిత్తం బయటకు రావడం కనిపించింది.
క్రమసంఖ్యల కేటాయింపు :
కరీంనగర్ నగరపాలక సంస్థతోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి పురపాలికల్లోని బీ కేటగిరీ దుకాణాలకు క్రమసంఖ్యలను కేటాయించారు. ఏ కేటగిరీలోకి వచ్చే మందుల దుకాణాలు, అత్యవసర సేవల్లోకి వచ్చేవి ఉండటంతో ఇవన్నీ రోజూవారీగా నిర్ణీత వేళల్లో తెరుచుకుంటున్నాయి. దీంతో ప్రజల ఇతర అవసరాలకు ఉపయుక్తమైన దుకాణాలను బీ కేటగిరీ జాబితాలోకి చేర్చారు. ఇక సీ కేటగిరీలో మాత్రం ఫంక్షన్‌హాళ్లు, హోటళ్లు, విద్యాసంస్థలు, ఇతరత్రా ఉన్నాయి.
వీటికి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అనుమతివ్వడంలేదు. అందుకనే బీ కేటగిరీలోని పలు రకాల దుకాణాలను సరి, బేసీ సంఖ్యలను కేటాయించి తేదీల ప్రకారం తెరుస్తున్నారు. ఇలా బీ కేటగిరీలో ఉండే వస్త్ర దుకాణాలు, చెప్పులు, మొబైల్, ఫర్నీచర్ ఇలాంటి దుకాణాలకు ఐదు పట్టణాల్లో నంబర్లు కేటాయించారు. నేటి నుంచి పక్కాగా పర్యవేక్షణ పెరగనుంది. కరీంనగర్‌లో మూడు డివిజన్లు మినహాయించి దాదాపు అన్ని డివిజన్లలో నంబర్లు ఇచ్చారు. 2347 మంది వ్యాపారకేంద్రాల్ని గుర్తించారు. మిగతా మూడు డివిజన్లలో బీ కేటగిరీల్లో మరో 250 వరకు ఉండే వీలుంది.
జాగ్రత్తలు తీసుకోకుంటే కష్టమే..!
ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ నియంత్రణతోపాటు అన్ని రకాల జాగ్రత్తల్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యక్తిగత దూరాన్ని పాటించడంతోపాటు మాస్క్‌లను తప్పనిసరిగా వాడటం, దుకాణాల చెంతన శానిటైజర్ల వినియోగం తప్పనిసరిగా వినియోగించేలా అధికారులు దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. గురువారం కరీంనగర్ పట్టణంలో వ్యక్తిగత దూరాన్ని పాటించకుండా సామగ్రిని విక్రయిస్తున్న మూడు దుకాణదారులపై నగరపాలక సంస్థ అధికారులు కొరఢా ఝళిపించారు. జిల్లా ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు మాత్రం ప్రజలు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.