local body mlc elections polling : తెలంగాణలోని అయిదు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నిక స్వల్ప వాగ్వాదాలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగగా, మొత్తం 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం 8 నుంచి ప్రారంభమైన ప్రక్రియ సాయంత్రం 4 వరకు కొనసాగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులతో పాటు మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు వేర్వేరు ప్రాంతాల్లో ఓటు వేశారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటున్న కాంగ్రెస్, భాజపా ఎంపీలు ఎన్నికల్లో పాల్గొనలేదు. సీఎం కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఎన్నికల తీరుతెన్నులను కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఎక్స్ అఫిషియో సభ్యునిగా నమోదు చేసుకోని కారణంగా ఈటల రాజేందర్ ఓటు వేయలేకపోయారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, ఓట్ల లెక్కింపు ఈ నెల 14న నిర్వహిస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పోలింగ్ ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుచేశామన్నారు. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం ఉందని, గెలుపొందిన అభ్యర్థులెవరూ ఆ ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. అంతకుముందు పెద్దపల్లి జిల్లా కేంద్రం సహా పలు జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాలను శశాంక్ గోయల్ పరిశీలించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,324 ఓట్లు ఉండగా 1320 పోలయ్యాయి. కరీంనగర్ పోలింగ్‌కేందంలో 205 మందికిగానూ ఎంపీ బండి సంజయ్ మినహా అందరూ ఓటేశారు. రాజన్న సిరిసిల్ల పోలింగ్ కేంద్రంలో 201కిగానూ 200 మంది ఓటును వినియోగించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్, కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్, జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని ఓటేశారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఓటేసేందుకు రాలేదు. గంగుల కమలాకర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పోలింగ్ కేంద్రానికి గులాబీ కండువాలతో రాగా పోలీసులు అభ్యంతరం తెలిపారు. కండువాలలో పార్టీ గుర్తులేదని వాదించిన అనంతరం లోపలికి అనుమతించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1026 ఓట్లకు 1018 పోలయ్యాయి. సీఎం కేసీఆర్ మినహా ఎక్స్ అఫిషియో సభ్యులందరూ ఓటువేశారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఓటుహక్కు వినియోగించుకున్నారు.