Local Body MLC Elections 2021: స్థానిక సంస్థల కోటాలో తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం జరిగే ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 37 పోలింగ్ కేంద్రాల్లో 5,326 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూంలకు తరలించి మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని ప్రకటిస్తారు.
ఏర్పాట్లు పూర్తి: సీఈవో
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ వెల్లడించారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్‌కాస్టింగ్, వీడియో ద్వారా పోలింగ్ ప్రక్రియను రికార్డ్ చేస్తామని తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓటరు స్లిప్పులను ఇప్పటికే పంపిణీ చేయడం జరిగిందన్నారు.
క్యాంప్ రాజకీయాలపై ఫిర్యాదులు లేవు
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు శశాంక్ గోయల్ వివరించారు. ఓటర్లందరూ మాస్క్ ధరించి పోలింగ్ కేంద్రానికి రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. క్యాంపు రాజకీయాలపై ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వెల్లడించారు. క్యాంపు రాజకీయాలపై అధికారులు దర్యాప్తు చేశారని శశాంక్ గోయల్ చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం.పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. క్యాంపు రాజకీయాల గురించి అధికారులు దర్యాప్తు చేశారు. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులెవరూ ఫిర్యాదు చేయలేదు. కొవిడ్ నిబంధలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. -శశాంక్ గోయల్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
ఇప్పటికే 6స్థానాలు ఏకగ్రీవం