తెలంగాణ

telangana

ETV Bharat / state

HUZURABAD PRACHARAM: నేడే ప్రచారానికి తెర.. విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన ప్రధాన పార్టీలు - ప్రధాన పార్టీల ప్రచారం

హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం తుదిదశకు చేరింది. సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుండటంతో అభ్యర్థులకు మద్దతుగా నేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. భాజపా అభ్యర్థికి మద్దతుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌తోపాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విస్తృతంగా ప్రచారంచేశారు. తెరాసకు మద్దతుగా మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆత్మగౌరవంకోసం పోరాడుతున్నట్లు ఈటల రాజేందర్ ప్రచారంచేయగా..తన ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టారని తెరాస నేతలు విమర్శలు గుప్పించారు.

last day for election campaign in huzurabad
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం

By

Published : Oct 27, 2021, 5:14 AM IST

తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న హుజూరాబాద్‌ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈటల రాజేందర్ తనకు తాను ఎక్కువగా ఊహించుకొని బోర్లా పడ్డారని మంత్రి తలసానిశ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు. వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేసిన ఆయన హుజురాబాద్‌లో కచ్చితంగా తెరాస ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇల్లందకుంటలో జరిగిన ధూంధాం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌ రావు.. ఈటల రాజేందర్‌ తన ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు.తెరాస సర్కార్‌ చేపడుతున్న అభివృద్దిని దృష్టిలో పెట్టుకొని ఓటేయాలని ప్రజలను కోరారు.


హుజూరాబాద్‌లో ప్రజాస్వామ్యం రావాలంటే భాజపాకు ఓటు వేయాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కోరారు. ఈటల రాజేందర్‌కు మద్దతుగా జమ్మికుంట, వావిలాలలో రోడ్‌ షో నిర్వహించారు. అధికార తెరాస ప్రలోభాలకు లొంగవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నీతి, నిబద్దతతో ఉద్యమంలో పాల్గొన్న తనపై తెరాస నేతలు తోడేళ్లలా దాడి చేస్తున్నారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ విమర్శించారు. వాగొడ్డు రామన్నపల్లిలో నటుడు బాబుమోహన్‌తో కలిసి ప్రచారం చేసిన ఆయన తెరాస చేస్తున్న అబద్ద ప్రచారాన్ని చూసి ప్రజలు ఛీ కొడుతున్నారని చెప్పారు.


కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్‌కు మద్దతుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క కమలాపూర్‌లో ఇంటింట ప్రచారం చేశారు. తెరాస, భాజపా రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు.

సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుండటంతో తెరాస, భాజపా, కాంగ్రెస్‌ బలప్రదర్శనకు ప్రణాళిక సిద్దం చేశాయి. తెరాస నుంచి పలువురు హరీశ్‌తోపాటు పలువురు మంత్రులు పాల్గొనుండగా..... కాంగ్రెస్‌ నుంచి PCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ రోడ్‌షోలో పాల్గొననున్నారు

ఇదీ చదవండి:

Bandi Sanjay: 'మేధావి వర్గం మౌనం వీడకపోతే రాబోయే తరాలకు అన్యాయం'

ABOUT THE AUTHOR

...view details