కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోనే ఉన్నప్పటికీ బొమ్మకల్ గ్రామం... ప్రత్యేక పంచాయతీగా కొనసాగుతోంది. దీంతో పంచాయతీ పరిధిలోని భూములకు ఎనలేని డిమాండ్ పెరిగింది. ధరలు మంచిగా పలకుతున్న నేపథ్యంలో... భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. అధికారుల అండదండలతో... పట్టా భూములతోపాటు... ప్రభుత్వ భూములను సైతం కబ్జా చేస్తున్నారు.
ఫిర్యాదులు వస్తున్నా...
తమ భూములు దళారులు కబ్జా చేస్తున్నారనే ఫిర్యాదులు కలెక్టర్‌కు అందుతున్నప్పటికీ... వాటికి పరిష్కారం దొరకడం లేకుండా పోతుంది. అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగుతున్నా న్యాయం జరగడం లేదని బాధితులు వాపోతున్నారు. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం, మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో అధికారులు విచారణకు శ్రీకారం చుట్టారు.
గ్రామ సర్పంచ్‌దే...
బొమ్మకల్ గ్రామ సర్పంచ్ పుర్మల్ల శ్రీనివాస్ సైతం అడ్డదారులు తొక్కుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. భూ యజమానిని బెదిరించి... వారి భూములు మరొకరికి ధారాదత్తం చేయడంలో సర్పంచ్ కీలకపాత్ర పోషించారని భూ యజమానులు వ్యాఖ్యానిస్తున్నారు. భూ కబ్జాలు శృతి మించడంతో బాధితులంతా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో సర్పంచ్‌ను అరెస్ట్ చేసి... లోతైనా విచారణకు అధికారులు రంగంలోకి దిగారు. భారీ ఎత్తున నకిలీ డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.