Land Grabs In Karimnagar :భూముల ధరలకు రెక్కలు రావడంతో కరీంనగర్‌లో ఇటీవల భూకబ్జాలు మితి మీరిపోయాయి. నగరపాలక పరిధిలో పది మంది కార్పొరేటర్లపై ముమ్మరంగా ఫిర్యాదులు వచ్చాయి. వీరికి గతంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో పట్టించుకునే వారు కరువయ్యారని బాధితులు తెలిపారు. ఎన్నికల వేళ సీపీగా వచ్చిన అభిషేక్ మహంతి మాత్రం ఆయా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో భూకబ్జాల కేసులో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులు రాష్ట్రంలోని ప్రముఖ నాయకుల నీడలో బతుకు వెళ్లదీసిన వారే కావడం గమనార్హం.
CP Abhishek Investigation Land Grab :కరీంనగర్ జిల్లాలో ఓ భూకబ్జా కేసులో అరెస్ట్ అయిన చీటి రామారావు మాజీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడని ప్రచారంలో ఉంది. మరో నిందితుడిగా ఉన్న కార్పోరేటర్ తోట రాములు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అనుచరుడిగా ఉండేవారని స్థానికులు చెప్పుకుంటున్నారు. అయితే భూ దందాలకు సంబంధించిన వ్యవహారంలో కరీంనగర్ పోలీసులు మొదటి కేసులోనే ప్రముఖ నాయకులకు సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. దీంతో అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్న సంకేతాలిచ్చారు కరీంనగర్ పోలీసులు.
పప్పు.. బెల్లం.. కబ్జాలకు లేదు కళ్లెం..
Land Grabs In Karimnagar: కరీంనగర్‌లోని భగత్‌నగర్‌కు చెందిన కొత్త రాజిరెడ్డి అనే వ్యక్తికి చెందిన భూమి విషయంలో కార్పోరేటర్ తోట రాములుతో పాటు చీటి రామారావు జోక్యం చేసుకుని తమను ముప్పుతిప్పలు పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఫిర్యాదు చేసినా అప్పటి అధికారులు నిందితులపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కించారని వెల్లడించారు.