ప్రస్తుతం కాళేశ్వరం నుంచి రాజరాజేశ్వర జలాశయానికి రెండు టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. దీనికి అదనంగా మరో టీఎంసీని తరలించేందుకు ప్రణాళికలు పూర్తయ్యాయి. భూ సేకరణ.. పరిహారం చెల్లింపులు కొలిక్కి వస్తే పనులు ప్రారంభించాల్సి ఉంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి వరకు 23 కిలోమీటర్ల వరద కాలువ ఉంది. అదనపు టీఎంసీ తరలింపునకు ప్రస్తుతం ఉన్న కాలువకు సమాంతరంగా ఎడమవైపు 160 మీటర్ల వెడల్పుతో మరొకటి తవ్వాలి. 23 కిలోమీటర్ల పనులను.. రెండు ప్యాకేజీలుగా అధికారులు చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. రామడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల్లో.. పన్నెండు గ్రామాల్లో 650 ఎకరాల భూమి సేకరించాలి. ఇప్పటికే ప్రాథమిక సర్వే పూర్తయ్యింది. తొలిసారి వరద కాల్వ తవ్వకానికి భూసేకరణ సమయంలో ఈ గ్రామాల్లో పెద్దగా అడ్డంకులేవి రాలేదు. కారణం మెట్ట ప్రాంతానికి మూడేళ్లుగా గోదావరి జలాలు తరలింపుతో.. ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది.
అగమ్యగోచరంగా దేశాయిపల్లి పరిస్థితి..
బోయినపల్లి మండలం దేశాయిపల్లిలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ గ్రామంలో రెండువందల ఇండ్లుండేవి. మొదటి భూ సేకరణ సమయంలో నలభై ఇండ్లు సేకరించారు. కాలువ... గ్రామం మధ్య నుంచి వెళ్లడం వల్ల గ్రామం రెండుగా చీలింది. ప్రస్తుతం 80 ఇండ్లు సేకరించేందుకు ప్రాథమిక సర్వే చేసి.. హద్దులు నిర్ణయించారు. ఇక మిగిలేది 80 ఇండ్లు మాత్రమే... వీటిలోనూ కాలువకు రెండువైపులా ఉండటం వల్ల.. ఎలాంటి అభివృద్ధికి నోచుకోని పరిస్థితి ఉంది. గ్రామాన్ని పూర్తిగా సేకరించి.. ముంపు గ్రామానికి ఇచ్చే ప్యాకేజీ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. అటు భూములు ఇచ్చేందుకు.. రైతుల నుంచి దిక్కార స్వరం వినిపిస్తూనే ఉంది.