అపురూప ప్రకృతిసౌందర్యంతో పర్యాటకుల మదిదోచుకుంటున్న కరీంనగర్ దిగవమానేరు జలాశయం ప్రమాదాలకు, ప్రాణాలు తీసుకునేందుకు నిలయంగా మారింది. నిత్యం వేలమంది సందర్శకులతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో కొందరు ప్రమాదవశాత్తు జలాశయంలో పడిపోతుండగా మరికొందరు ఆత్మహత్యలు చేసుకునేందుకు అక్కడకు వస్తున్నారు. జలాశయంలో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. వరస ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు... ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు జలాశయం వద్ద లాక్‌పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేశారు. ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్, 9 మంది కానిస్టేబుళ్లు, ఆరుగురు హోంగార్డులు సహా... మొత్తం 17మంది సిబ్బంది నిరంతరం మానేరు డ్యాం పరిధిలో గస్తీకాస్తూ పర్యవేక్షిస్తున్నారు. పెట్రోలింగ్ కారు, 2 ద్విచక్ర వాహనాలతో 24 గంటలు తిరుగుతూ అందుబాటులో ఉంచారు. అనుమానస్పదంగా ఎవరుకనిపించినా వెంటనే అక్కడికి చేరుకుని సిబ్బంది కారణాలపై ఆరాతీస్తున్నారు. అక్కడ విధులు నిర్వర్తించే వారందరికి ప్రాణాల్ని రక్షించేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వివిధ సమస్యలతో ఆత్మహత్యకు యత్నిస్తున్న వారిని అడ్డుకోవటంతో పాటు... వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 90మందికి పైగా బాధితులను రక్షించినట్లు లేక్ పోలీసులు చెబుతున్నారు.