తాను ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించాలంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు బైటాయించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఏరడపల్లిలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా జూలపల్లికి చెందిన యువతి.. ఏరడపల్లి గ్రామానికి చెందిన నాగుల చంద్రశేఖర్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో ఏడాది క్రితం వివాహం జరిపించారు. అయినప్పటికీ వీరి ప్రేమాయణం కొనసాగుతుంది.
ప్రియుని మాట విని భర్తకు విడాకులిచ్చింది.. ఇప్పుడేమైంది? - love marriages
ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇంతలోనే యువతి తల్లిదండ్రులు వేరొకరితో వివాహం చేశారు. అయినా వారి ప్రేమను కొనసాగించారు. భర్తకు విడాకులిచ్చేసి వస్తే పెళ్లి చేసుకుందామన్నాడు. ప్రియుని మాట విని తీరా... భర్తకు విడాకులిచ్చాక తానెవరో తెలియనట్లు మాట్లాడుతున్నాడు. మోసపోయానని తెలుసుకున్న యువతి ప్రియుని ఇంటి ముందు బైఠాయించి... తనకు న్యాయం చేయాలంటూ దీక్ష చేస్తోంది.
చంద్రశేఖర్ తరచుగా తనతో చరవాణిలో మాట్లాడేవాడని బాధితురాలు పేర్కొంది. తన భర్తకు విడాకులు ఇచ్చి వస్తే పెళ్లి చేసుకుంటానని చంద్రశేఖర్ చెప్పగా... తన భర్త నుంచి ఇటీవలే విడాకులు తీసుకున్నట్లు బాధితురాలు తెలిపింది. ఇప్పుడైనా తనను పెళ్లి చేసుకోవాలని చంద్రశేఖర్‌ని కోరగా నిరాకరించినట్లు... ఎవరో తెలియదన్నట్లుగా మాట్లాడుతున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
తనను మాయ మాటలతో మోసం చేశాడని వాపోయింది. మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి చంద్రశేఖర్ ఇంటి ఎదుట బైఠాయించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని... తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చి బాధితురాలికి నచ్చజెప్పారు.