నియంత్రిత సాగు పేరిట వరిలో సన్న రకమైన తెలంగాణ సోనను సాగు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులపై ఒత్తిడి చేశారని తెతెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ విమర్శించారు. అధిక వర్షాలు, దోమ పోటు తదితరాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో తెలంగాణ సోన సాగుతో నష్టపోయిన క్షేత్రాలను ఆయన పరిశీలించారు.
తెలంగాణ సోన వరి పంటకు ప్రతికూల పరిస్థితులను తట్టుకునే శక్తి ఉండదని తెలిసినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడి వల్లే రైతులు ఆ పంటను సాగుచేశారని రమణ పేర్కొన్నారు. ఇప్పుడు దోమపోటుతో పంటలు నష్టపోయారని ఆరోపించారు. పంటల సాగు విషయంలో రైతుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని.. ఆ మేరకు సాగు చేస్తే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యల పట్ల ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.