KTR Speech at Karimnagar BRS Meeting Today :గంగుల కమలాకర్‌పై పోటీ అంటేనే.. అందరూ పారిపోతున్నారని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్లో పోటీ చేస్తే ఏమవుతుందో కాంగ్రెస్, బీజేపీ నేతలకు తెలుసని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం(BRS Election Campaign)లో బిజీబిజీగా గడుపుతున్న కేటీఆర్.. నేడు కరీంనగర్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(BRS Meeting in Karimnagar)లో పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్, బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు.. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక కమిటీ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ హాజరయ్యారు.
KTR Election Campaign in Karimnagar :రాష్ట్రంలో 2.2 లక్షల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామని.. ఇప్పటికే 1.3 లక్షల ఉద్యోగాలిచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అవసరమైతే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఉద్యోగాల భర్తీ చేస్తామని వెల్లడించారు. మోదీ చెప్పిన రూ.15 లక్షలు వచ్చినవారు బీజేపీకి.. రైతుబంధు వచ్చినవారు బీఆర్ఎస్కు ఓటు వేయాలని సూచించారు. కరీంనగర్ నుంచి గెలిచిన ఎంపీ బండి సంజయ్.. ఈ ఐదేళ్లలో ఏదైనా పని చేశారా అని ప్రశ్నించారు. మోదీ ఎవరికి దేవుడో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎప్పుడూ మతం పేరుతో రాజకీయాలు చేయలేదని.. 9 ఏళ్లుగా తెలంగాణ ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్నారని స్పష్టం చేశారు. నిజమైన హిందువు ఎవరూ ఇతర మతాలపై దుమ్మెత్తిపోయరని వ్యాఖ్యానించారు.
"కొంతమంది చిల్లర రాజకీయం చేస్తున్నారు. ప్రవళ్లిక అనే అమ్మాయి హైదరాబాద్‌లో మరణిస్తే.. ఆ యువతి మృతిని రాజకీయం చేశారు. ఈరోజు బాధిత కుటుంబం నా దగ్గరకు వచ్చారు. ఆ కుటుంబానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మాట ఇచ్చాను. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, బీజేపీ నేతలు వస్తారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. తప్పకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉద్యోగులు విడుదల చేస్తాం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం."- కేటీఆర్, మంత్రి