తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR on Bandi Sanjay: 'మత పిచ్చి తప్ప.. సంక్షేమ పనులు ఒక్కటైనా చేశారా.?' - ktr comments on bjp

KTR on Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తుంటే.. భాజపా మాత్రం రాష్ట్రంలో మత పిచ్చిని రేపుతోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఆరోపించారు. మూడేళ్లుగా ఎంపీగా ఉంటున్న బండి సంజయ్​ కరీంనగర్​లో.. ఏమైనా అభివృద్ధి పనులు చేశారా అని ప్రశ్నించారు. ఎప్పటికీ విషం చిమ్మడమే రాజకీయం కాదని వ్యాఖ్యానించారు. కరీంనగర్​ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్​.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

KTR on Bandi Sanjay
కరీంనగర్​లో కేటీఆర్​ పర్యటన

By

Published : Mar 17, 2022, 3:08 PM IST

Updated : Mar 17, 2022, 3:20 PM IST

KTR on Bandi Sanjay: మత పిచ్చి తప్ప.. తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటైన అమలు చేశారా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను ఉద్దేశించి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ప్రశ్నించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలని కేంద్రాన్ని సంజయ్‌ ఎప్పుడైనా అడిగారా అని అన్నారు. మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ కోరితే కేంద్రం మొండిచేయి చూపెట్టిందని పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు అందించి ప్రజల మనసు గెలవాలని హితవు పలికారు. కరీంనగర్​ జిల్లాలో పర్యటించిన కేటీఆర్​.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్‌లో 24 గంటల నీటి సరఫరా, మానేరు రివర్ ఫ్రంట్ పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మిషన్​ భగీరథ పైలాన్​ను ఆవిష్కరించారు.

మత పిచ్చి తప్ప.. సంక్షేమ పనులు ఒక్కటైనా చేశారా?: కేటీఆర్​

మీరేం చేశారు.?

"రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేస్తుంటే మీరేం చేశారు.? మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ కోరితే కేంద్రం మొండిచేయి చూపెట్టింది. కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలని సంజయ్‌ ఎప్పుడైనా అడిగారా?. వైద్య కళాశాల, ట్రిపుల్‌ ఐటీ సంస్థలు ఏమైనా తీసుకువచ్చారా?. నేదునూరులో విద్యుత్‌ కేంద్రం ఏమైనా తీసుకువచ్చారా?. రాష్ట్రంలో మత పిచ్చిని రేపారు తప్ప.. సంక్షేమ పనులు ఒక్కటైనా చేశారా?. మేము రూపాయి ఇస్తే మీరు 4 రూపాయలు ఇవ్వాలి. సంక్షేమ ఫలాలు అందించి ప్రజలు మనసు గెలవాలి" -కేటీఆర్​, పురపాలక శాఖ మంత్రి

బైక్​ ర్యాలీ

అంతకుముందుగా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో తెరాస కార్యకర్త కుటుంబాన్ని కేటీఆర్‌ పరామర్శించారు. మృతిచెందిన తెరాస కార్యకర్త కుటుంబానికి 2 లక్షల చెక్కును మంత్రి అందజేశారు. రేణికుంట టోల్‌ప్లాజా వద్ద మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. అనంతరం తిమ్మాపూర్ నుంచి తెరాస శ్రేణులు ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. భారీ ద్విచక్రవాహన ర్యాలీ మధ్య కేటీఆర్‌ కరీంనగర్‌ బయలుదేరారు. శంకుస్థాపన కార్యక్రమాల అనంతరం.. నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్​ మాట్లాడారు.

ఉగాది తర్వాత పంపిణీ

కరీంనగర్‌లో రూ.615 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని కేటీఆర్ తెలిపారు. నగరంలో 1,600 రెండు పడక గదుల ఇళ్లు కేటాయించామని.. ఉగాది తర్వాత 660 మంది లబ్ధిదారులకు 2 పడకల ఇళ్లు పంపిణీ చేస్తామని వివరించారు. నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేశామని.. ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. మానేరు రివర్‌ ఫ్రంట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని కేటీఆర్​ అన్నారు. ఈ ఏడాది మానేరు రివర్‌ ఫ్రంట్‌లోనే బతుకమ్మ ఆడాలని మహిళలకు సూచించారు. కుటుంబాలతో వన భోజనాలకు వచ్చేలా మానేరు రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం వృద్ధులకు ఆత్మగౌరవాన్ని కల్పించిందని.. వృద్ధాప్య పింఛన్లను రూ.2 వేలకు పెంచిందని కేటీఆర్​ అన్నారు. రాష్ట్రంలో 4.20 లక్షల మంది బీడీ కార్మికులకు రూ. 2,016 చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. లక్ష మందికి పైగా ఒంటరి మహిళలకు రూ.2, 016 పింఛన్‌ అందజేస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండి:సంజయ్​ దిల్లీ వెళ్లారు.. తెలంగాణకు బుల్డోజర్లు వస్తున్నాయ్​: రాజాసింగ్​

Last Updated : Mar 17, 2022, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details