తెలంగాణ

telangana

ETV Bharat / state

ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ : కేటీఆర్​ - karimnagar latest news

ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించి ఉన్నచోటనే యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదని ఇప్పుడు ఇంటెలిజెంట్ టెక్నాలజీగా మారిపోయిందని చెప్పారు. కరీంనగర్​లో ఐటీ హబ్​ను ప్రారంభించారు.

ktr inaugurated it tower in karimnagar
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ: కేటీఆర్​

By

Published : Jul 21, 2020, 5:40 PM IST

Updated : Jul 21, 2020, 8:26 PM IST

ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ: కేటీఆర్​

రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కరీంనగర్‌లో పర్యటించారు. హరితహారంలో భాగంగా దిగువమానేరు వద్ద మొక్కలు నాటారు. అనంతరం 108 కోట్లతో చేపట్టిన అర్బన్ మిషన్ భగీరథ పనుల్లో భాగంగా శాతవాహన యూనివర్సిటీలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ నుంచి ప్రతిరోజు తాగునీటి సరఫరాను ప్రారంభించారు. ఆ తర్వాత 34 కోట్లతో నిర్మించిన ఐటీ హబ్‌ను మరో మంత్రి గంగుల కమలాకర్, ఐటీ కార్యదర్శి జయేష్ ‌రంజన్‌, మేయర్ సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 432 మంది యువతకు ఉద్యోగ పత్రాలు అందజేశారు.

లక్ష 28 వేల కోట్ల ఐటీ ఎగుమతులు

తెలంగాణ వచ్చిన కొత్తలో 56 వేల కోట్ల ఐటీ ఎగుమతులు ఉండేవని.. ఇప్పుడు లక్ష 28 వేల కోట్లకు చేరుకున్నాయన్నారు కేటీఆర్​. వాస్తవానికి ఇందులో ప్రభుత్వం పెట్టుబడులు ఏమీ పెట్టలేదని.. ఐటీ రంగానికి ఉత్ప్రేరకంగానే ఉందని... చేసేదంతా ప్రయివేట్​ రంగమేనని పేర్కొన్నారు. ఐటీ రంగంలో టాలెంట్ కేవలం హైదరాబాద్, బెంగుళూర్, దిల్లీ లాంటి నగరాల విద్యార్థులకే సొంతం కాదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాలు, నగరాల్లోని నైపుణ్యవంతులైన యువత ఇతర నగరాలకు వలస పోవాల్సిన అవసరం లేకుండా ఐటీని విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఐటీ నిర్వచనం కూడా మారాల్సిన పరిస్థితి ఉందని ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు.. ఇప్పుడు ఇంటెలిజెన్స్ టెక్నాలజీగా మారిందన్నారు. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నో విజయాలు సాధించవచ్చన్న మంత్రి.. మాస్కులు ధరించారా లేదా అని గుర్తించే టెక్నాలజీని పోలీసులు వాడుతున్నారని తెలిపారు.

అవసరమైతే.. మరో టవర్ కూడా..

తెలివైన యువతీయువకులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఎన్నో అద్భుత విజయాలు సాధిస్తున్నారని చెప్పారు. స్థానిక యువతలో ఉన్న టాలెంట్​ను గుర్తించి ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మనిషి జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కరించే ఐటీ సొల్యూషన్స్ రావల్సి ఉందన్నారు. కొవిడ్ సంక్షోభం వల్ల ఐటీ టవర్​లో స్టార్టప్‌లకు జనవరి వరకు ఎలాంటి అద్దె భారం లేకుండా ఆదుకోవడమే కాకుండా అవసరమైతే.. మరో టవర్ కూడా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎం ఎంతో పట్టుదలతో గోదావరి, కృష్ణా జలాలను బీడు భూములకు మళ్లించి తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్​లో స్లైక్లింగ్ పార్కును కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ మానేరు నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం 90 శాతం పూర్తి కావచ్చిందన్నారు. అలుగునూరు చౌరస్తాను గేట్ వే ఆఫ్ కరీంనగర్​గా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

భవిష్యత్​లో 24 గంటల మంచినీటి సరఫరా

అంతకు ముందు కరీంనగర్​లో ప్రతిరోజు ప్రజలందరికీ మంచినీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించటం సంతోషంగా ఉందన్న కేటీఆర్‌.. కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా విజయవంతమవుతుందని సీఎం కేసీఆర్ బలంగా నమ్ముతారని పేర్కొన్నారు. అందుకే కరీంగనర్ నుంచే అనేక కార్యక్రమాలు ప్రారంభించారని తెలిపారు. ప్రతిరోజు నీటిసరఫరా పథకం త్వరలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అమలు చేస్తామన్నారు. భవిష్యత్​లో 24 గంటల మంచినీటి సరఫరా కూడా కరీంనగర్ నుంచే ప్రారంభిస్తామని... 109 కోట్లతో చేపట్టిన ఈ కార్యక్రమం 2048 నాటి జనాభాను దృష్టిలో పెట్టుకొని అమలు చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత తీగల వంతెన పనులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన

Last Updated : Jul 21, 2020, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details