Koppula Eshwar Review on Dalita Bandhu Scheme : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని.. పారదర్శకంగా అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దళితబంధు అమలుపై కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయం నుంచి.. జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారమే..దళితబంధు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మొదటి దశలో ఎమ్మెల్యేల సూచనతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టడంపై అపోహలు రావడంతో.. జిల్లా కలెక్టర్లకే ఆ బాధ్యత అప్పగించడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు సంబంధిత జిల్లా మంత్రులు.. జిల్లా కలెక్టర్లతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని కొప్పుల ఈశ్వర్ వివరించారు.
Koppula Eshwar on Dalita Bandhu :దళితబంధు రెండో విడతలో ప్రభుత్వం కేటాయించిన.. రూ.1700 కోట్ల రూపాయల నిధుల్లో.. ఇప్పటికే రూ.850 కోట్ల నిధులు మంజూరైనట్లు కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దశల వారీగా ప్రతి దళిత కుటుంబానికి పథకం వర్తింపజేసే లక్ష్యంతో.. ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి.. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యమని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.