కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమీప బంధువు పాడి కౌశిక్‌రెడ్డి (Kaushik Reddy ) పేరిట ఒక ఆడియో సోషల్‌మీడియాలో (social media)కలకలం సృష్టిస్తోంది. తెరాస హుజూరాబాద్ టికెట్ తనకే వస్తుందని ఆ ఆడియోలో కౌశిక్ చెబుతున్నట్లుగా ఉంది. యువతకు ఎన్ని డబ్బులు కావాలో చూసుకుంటాను అన్న వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి.
కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు తెరాసలో చేరుతారా?
ఓవైపు తాను కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని చెప్తూనే... మరోవైపు రహస్యంగా తెరాస అభ్యర్థిగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లుగా ఈ ఆడియోలో స్పష్టమవుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న పాడి కౌశిక్‌రెడ్డి ఆడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశం
కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన ఓ యువకుడితో మాట్లాడిన సంభాషణలో యువతను తనవైపు రావడానికి అవసరమైతే 5వేల రూపాయల వరకు ఇవ్వాలని కౌశిక్‌రెడ్డి సూచించారు. తెరాస అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు ఆ ఆడియోలో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డితో టచ్‌లో ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో గురించే తెరాసతో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో చర్చలు జరుగుతన్నాయి.
యువతకు ఎన్ని డబ్బులు కావాలో నేను చూసుకుంటాను.. యువకుల ఖర్చులకు 2-3 వేల రూపాయలు ఇస్తాను. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలి. యువకుల లిస్టు నాకు కావాలి. - కౌశిక్‌రెడ్డి
పీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఆడియో గురించి కౌశిక్‌రెడ్డి ఇప్పటివరకు స్పందించలేదు కానీ.. కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కౌశిక్‌కు పీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులిచ్చింది. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. లేకుంటే చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
గతంలోనూ కౌశిక్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. తెరాస నేతలతో సన్నిహితంగా ఉంటున్నట్లు కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంలో పీసీసీ క్రమశిక్షణ సంఘం హెచ్చరించింది.