కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా గత నాలుగేళ్లుగా పారిశుద్ధ్య పనుల నిర్వహణలో మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగా ఇంటి నుంచి వచ్చే చెత్తను వేరు చేసేలా ఇంటికీి రెండు డబ్బాలు ఇచ్చి తడి, పొడి చెత్తను వేరుగా వేసేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం చెత్తను కలిపి ఇవ్వకుండా తడి, పొడి వేరు చేయడంతో తడి చెత్తను కంపోస్టు యార్డుకు, పొడి చెత్తను డీఆర్‌సీసీ కేంద్రాలకు కార్మికులు తరలిస్తున్నారు.
నగరంలో అయిదు కేంద్రాలు ఏర్పాటు
ఇంటి నుంచి సేకరిస్తున్న పొడి చెత్తను డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్ తరలిస్తారు. వీటిని నగరపాలక సంస్థ నగరంలో ఐదు చోట్ల ఏర్పాటు చేసింది. డంపింగ్‌యార్డు, ఎస్‌ఆర్‌ఆర్ ట్యాంకు, మున్సిపల్ ఉద్యోగుల సంఘ భవనం, భగత్‌నగర్, సప్తగిరికాలనీ వెహికల్ షెడ్డు దగ్గర పొడి చెత్త కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. కొనుగోలు చేస్తున్న చెత్తను ఐటీసీ, వావ్, ఈశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కంపెనీ రీస్లైకింగ్ కేంద్రానికి తరలిస్తారు.
సేకరించిన చెత్తను తీసుకొచ్చిన కార్మికులు
56 రకాల వస్తువుల వేరు
ప్రతిరోజు ఆటో రిక్షాల ద్వారా 10 టన్నుల పొడి చెత్త వస్తోంది. ఈ చెత్తను కార్మికులు వేరు చేసి తీసుకొస్తారు. డబ్బాలు, ఇనుప వస్తువులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు, సీసాలు, అట్ట పెట్టలు, పనికి రాని కాగితం, కలర్ ప్లాస్టిక్, నల్ల ప్లాస్టిక్, నూనె, పాల ప్యాకెట్లు, కాగితాలు, రాగి, సీడీలు, ఇతర రకాల వస్తువులు వేరు చేస్తారు. ఇలా 56రకాల చెత్తను తీసుకొస్తుండగా వాటిని ఈ కేంద్రాలలో కిలోల చొప్పున కొనుగోలు చేస్తారు.
*నగరం నుంచి తీసుకొచ్చే పొడి చెత్తతో ఉపాధి లభిస్తోంది. పారిశుద్ధ్య కార్మికులు తీసుకొచ్చిన చెత్తను కేంద్రం నిర్వాహకులకు అప్పగిస్తారు. రోజుకు ఒక్కో కార్మికుడికి రూ.200-రూ.400లు ఆదాయం వస్తోంది. కేంద్రం నిర్వాహకులు ఈ చెత్తను పూర్తిస్థాయిలో వేరు చేసి ప్యాకింగ్ చేస్తారు. ఇక్కడ పని చేసే కార్మికులు, నిరుద్యోగులకు రోజుకు రూ.300ల చొప్పున కూలీ అందజేస్తారు.
రెండేళ్లుగా కేంద్రం నిర్వహణ
కె.స్వరూప, డీఆర్‌సీసీ నిర్వాహకురాలు
చెత్తను కొనుగోలు చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసి రెండేళ్లు అవుతోంది. ఈ కేంద్రానికి ప్రతిరోజు 10 ఆటో రిక్షాలు వస్తాయి. వారి దగ్గర నుంచి పొడి చెత్తను తీసుకొని తూకం వేసి ఆ మొత్తానికి డబ్బులు అప్పగించడం జరుగుతుంది. తర్వాత ఈ చెత్తను పోగు చేసి కంపెనీకి అప్పగిస్తాం.