కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల నుంచి వస్తున్న దరఖాస్తులను స్వీకరించకుండా ఆయా వసతి గృహ సంక్షేమాధికారులు తిరస్కరిస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు నగరంలో వసతి కరవవుతోంది. ప్రస్తుతం ఇంటర్, డిగ్రీ కోర్సులకు మాత్రమే అడ్మిషన్లు పూర్తికాగా ఇంజినీరింగ్, పీజీ విద్యార్థులకు ప్రవేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంటర్ విద్యార్థుల కోటా నిండిపోయిందని, వసతి గృహాలలో సీట్లు లేవంటూ విద్యార్థులను పంపిస్తున్నారు. ఉన్నత విద్య చదవాలనుకునే నిరుపేద విద్యార్థులకు సీట్ల కొరత కలతకు గురిచేస్తోంది.
పెద్దఎత్తున విద్యార్థులు
నగరంతోపాటు నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇంజినీరింగ్-8, డిగ్రీ-16, ఎంబీఏ-10, ఫార్మసీ-6, ఇంటర్-24, పీజీ-10, డీఈడీ-4, బీఈడీ-6 కళాశాలలు, శాతవాహన విశ్వవిద్యాలయం ఉంది. ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులతోపాటు మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల నుంచి విద్యార్థులు పెద్దఎత్తున జిల్లా కేంద్రానికి వస్తున్నారు. అద్దె గదుల్లో ఉండాలనుకుంటే ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో వసతి గృహల్లో ఉండేందుకే విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. ప్రైవేట్ వసతి గృహల్లో ఒక్కోక్క విద్యార్థికి నెలకు సుమారు రూ.2,300లు వసూలు చేస్తున్నారు.
నాలుగింతల దరఖాస్తులు
నగరంలో నాలుగు బాలికల కళాశాల స్థాయి, మూడు బాలుర కళాశాల స్థాయి వసతి గృహాలు ఉన్నాయి. బాలికల వసతి గృహాల్లో 231 ఖాళీలు ఉంటే 460, బాలుర వసతి గృహాల్లో 178 ఖాళీలకు 399 దరఖాస్తులు వచ్చాయి. నగరంలోని ఏడు వసతి గృహాల్లో 409 ఖాళీలకు 859 దరఖాస్తులు అందాయి. ఖాళీల్లో 50 శాతం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కేటాయించగా 50 శాతం డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు పక్కనపెట్టారు.