తెలంగాణ

telangana

ETV Bharat / state

మూతపడే స్థాయినుంచి... విద్యార్థులతో కళకళలాడే దశకు - govt schools

గ్రామీణ ప్రాంతాల్లో చాలా సర్కారు బడులు విద్యార్థుల్లేక మూతపడిపోతున్నాయి. కానీ ఈ పాఠశాలల్లో మాత్రం ఉపాధ్యాయుల ప్రోత్సాహం.. ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల సహకారం వల్ల విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధన.. ఉచిత పాఠ్యపుస్తకాలు, ఇతర సామాగ్రి అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారు. దాతల చేయూత.. డిజిటల్‌ తరగతుల బోధనతో విద్యార్థులను బడిబాట పట్టిస్తున్నారు.

మూతపడే స్థాయినుంచి... విద్యార్థులతో కళకళలాడే దశకు

By

Published : Jul 6, 2019, 10:04 AM IST

గంగాధర మండలంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేటు పాఠశాలల్లో వేలాది రూపాయల ఫీజులు చెల్లించి చదువుకోలేని పేదలు తమ పిల్లలను సర్కారు బడులకే పంపిస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక చొరవ చూపి వారికి ఆంగ్లమాధ్యమంలో బోధన చేస్తూ ఉన్నత చదువుకు బాటలు వేస్తున్నారు. దీనంతటికీ కారణం ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల సహకారమే. ఆంగ్లమాధ్యంలో విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, సామాగ్రి అందజేస్తున్నారు.

అన్ని పాఠశాలలకు ఆదర్శం
బూర్గుపల్లి ప్రాథమిక పాఠశాలలో గతేడాది 156 మంది విద్యార్థులు చదువుకున్నారు. 5వ తరగతి విద్యార్థులు 36 మంది వెళ్లిపోయారు. అంటే 120 మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది బడిబాటలో 71 మంది విద్యార్థులు చేరడంతో ఆ సంఖ్య 191కు చేరింది. మూడేళ్ల కిందట నర్సరీ నుంచి 5వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించి ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్‌కుమార్‌తో పాటు ఉపాధ్యాయులు బడిబాటలో భాగంగా ఇంటింటికీ వెళ్లారు. బొమ్మకంటిపల్లి, చర్లపల్లి, లింగంపల్లి, బూర్గుపల్లి, నర్సింహులపల్లి, రామడుగు మండలం తిర్మలాపూర్‌ గ్రామాల నుంచి విద్యార్థులను పంపిస్తున్నారు. తల్లిదండ్రులతో వారానికోసారి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పిస్తున్నారు.

ఆటోలో విద్యార్థులు పాఠశాలకు..
గర్శకుర్తి ప్రాథమిక పాఠశాలకు ప్రతిరోజు గతేడాది నుంచి ఆటో ద్వారా విద్యార్థులను చేరవేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు కిషన్‌రెడ్డి సొంతంగా విద్యార్థుల కోసం ఆటో కొనుగోలు చేశారు. ఈ పాఠశాలలో ఈ విద్యాసంవత్సరానికి గాను 39 మంది విద్యార్థులు చేరారు. కాసారం, ఆచంపల్లి, కరీంనగర్‌ మండలం కొండాపూర్‌ నుంచి విద్యార్థులు ఇక్కడికి రావడం గమనార్హం.

మూతపడే దశ నుంచి 78 మంది విద్యార్థులు
హిమ్మత్‌నగర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో గతేడాది కేవలం 10 మంది విద్యార్థులే ఉన్నారు. వీరిలో ఒకరు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు వెళ్లగా మరొకరు వెదిర పాఠశాలలో చేరాడు. దీంతో 8 మంది మాత్రమే మిగలగా ఈసారి పాఠశాల మూసివేసే ప్రమాదానికి చేరింది. అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేందర్‌రెడ్డి, సర్పంచి మాల చంద్రయ్య గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. బడిని బతికించుకునేందుకు గ్రామ పంచాయతీ తీర్మానం చేశారు. గ్రామంలోకి ప్రైవేటు పాఠశాలల బస్సులు రానివ్వద్దని, పిల్లలను మన బడికే పంపించాలని నిర్ణయించారు.

కార్పొరేట్‌ పాఠశాలకు ధీటుగా..
కురిక్యాల ప్రాథమిక పాఠశాల కార్పోరేట్‌కు ధీటుగా ఉంది. పచ్చని చెట్లు ఆహ్లాదం పంచుతుండగా విద్యార్థులకు దాతల సాయంతో అన్ని వసతులు సమకూరాయి. ప్రధానోపాధ్యాయుడు చందూరి రాజిరెడ్డి చొరవతో ప్రతి తరగతి గదిలో రెండు ఫ్యాన్లు ఏర్పాటు చేయగా విద్యార్థులకు రక్షిత మంచినీరు అందించే వాటర్‌ కూలర్‌ అందుబాటులో ఉంచారు. గతేడాది ఈ పాఠశాలలో 102 మంది విద్యార్థులు ఉండగా 5వ తరగతి విద్యార్థులు 23 మందితోపాటు ఇతర కారణాలతో మరో 8 మంది వెళ్లిపోయారు. ఈ ఏడాది 59 మంది విద్యార్థులు బడిబాటలో చేర్పించారు.

సర్పంచి చూపిన బాటలో..
ఒద్యారం ప్రాథమిక పాఠశాలలో గతేడాది 56 మంది విద్యార్థులు చదివారు. వీరిలో 5వ తరగతి విద్యార్థులు 6గురు, ఇతర కారణాల వల్ల 15 మంది విద్యార్థులు వెళ్లిపోయారు. పాఠశాలలో 35 మంది విద్యార్థులు మిగలగా ఒక్కరే ఉపాధ్యాయురాలు శైలజ ఉన్నారు. దీంతో పాఠశాలకు విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేశారు. అయితే గ్రామ సర్పంచి ములుకుంట్ల సంపత్‌ గ్రామస్థులతో మాట్లాడి బడిని రక్షించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఇద్దరు కుమార్తెలను ఇదే పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు.

ఇవీ చూడండి: 'పురపాలక ఎన్నికలకు రంగం సిద్ధం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details