ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను ఆహ్వానించకుండా ..పూర్తిస్థాయి అధికారులు లేని సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటుచేయడం సిగ్గుచేటని జడ్పీటీసీ సభ్యుడు మాడుగుల రవీందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ లింగాల మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ సభ్యుడు రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ అలువాల కోటి హాజరయ్యారు.
గన్నేరువరం మండల సమావేశంలో రచ్చరచ్చ - karimnagar latest updates
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల సమావేశం గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను ఆహ్వానించకుండా.. పూర్తిస్థాయి అధికారులు లేకుండా సమావేశం నిర్వహించారని సభలో సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జడ్పీటీసీ సభ్యుడు మాడుగుల రవీందర్‌రెడ్డి అజెండా ప్రతులను చించి... ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టే అభివృద్ధి, నిధుల వ్యవహారంపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే పరిస్థితులు లేవని ఆరోపిస్తూ కొందరు విరుచుకుపడ్డారు. ఎంపీపీ, జడ్పీటీసీ వర్గీయులు ఒకరిపై ఒకరు మాటలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఎస్సై తిరుపతి వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేని కించపరుస్తున్నారంటూ వివిధ శాఖల నివేదిక అజెండా పత్రాలను చించివేసి జడ్పీటీసీ అతని వర్గీయులు సభ నుంచి వెనుదిరిగారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎంపీపీ ఇష్టారీతిన ప్రవర్తిస్తూ ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక పంపలేదని మండిపడ్డారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సమయానికి చేరుకోగా పలువురు ఆలస్యంగా హాజరయ్యారు. కాగా సమావేశానికి ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను పంపించినట్లు ఎంపీడీవో స్వాతి స్పష్టం చేశారు. వ్యక్తిగత విభేదాలతో అధికారులపై ఒత్తిడి తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:వీడియో కాల్‌తో లక్షలు దోచేస్తున్నారు...