Chinthakunta ZPHS chaduvulamma thalli gadde : మెరుగైన విద్యనందిస్తే ఏదైనా సాధించగలిగే నైపుణ్యం విద్యార్థులు సొంతం చేసుకోగలరు ప్రైవేట్ బడుల్లో కొంత మేర ఇది సాధ్యమవుతున్నా ప్రభుత్వ పాఠశాలలు కాస్త వెనకబడే ఉంటున్నాయి. అరకొర సౌకర్యాలతో నెట్టుకొస్తున్నాయి. కానీ...కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మాత్రం ప్రైవేట్‌కు దీటుగా నిలబడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోని చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల...ఇందుకు ఓ ఉదాహరణ. ఇక్కడి ఉపాధ్యాయులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పిల్లల్లో పఠనాసక్తి పెంచడం కోసం తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
కొత్త ప్రయోగానికి శ్రీకారం
విద్యార్థుల పుస్తక పఠనం నైపుణ్యాలు పెంపొందించడం కోసం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని జిల్లాపరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెలను పోలిన విధంగా చదువులమ్మ తల్లిని నెలకొల్పారు. పాఠశాల మధ్యలో దీనిని ఏర్పాటు చేసి... విద్యుర్తులకు చదువుపై ఆసక్తి కలిగిస్తున్నారు. పాఠశాల ఆవరణలో వేప చెట్టు చుట్టూ సిమెంట్‌తో గద్దె నిర్మించారు. ఆ చెట్టుకు చదువులమ్మ తల్లి చిత్రపటాన్ని రంగులతో వేశారు. గద్దె చుట్టూ సిమెంట్ బిల్లలతో విద్యార్థులు కూర్చునేలా కుర్చీల మాదిరి ఏర్పాటు చేశారు. విరామ సమయాల్లో విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ప్రధానోపాధ్యాయులు భూమిరెడ్డి సకల సౌకర్యాలు కల్పించారు.
వంద రోజుల రీడింగ్ ప్రోగ్రాం
విద్యార్థులను చదువులమ్మ తల్లి గద్దెను సరస్వతి తల్లిగా భావించి... చుట్టూ కూర్చుని చదువుకుంటున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూమిరెడ్డి. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలతో పాటు నాలెడ్జ్ పెంపొందించే పుస్తకాలు, వార్తా పత్రికలు కొనుగోలు చేసి అందిస్తున్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచడానికి ప్రభుత్వ పాఠశాల్లో 100 రోజుల రీడ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకొస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
చదువులమ్మ గద్దెను మేం కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం. వంద రోజుల రీడింగ్ కార్యక్రమంలో భాగంగా మా టీచర్లు దీనిని ఏర్పాటు చేశారు. విరామ సమయంలో మేం ఇక్కడ చదువుకుంటాం. చెట్ల కింద చల్లటి వాతావరణంలో చదువుకోవడం అంటే మాకు చాలా ఇష్టం. స్టోరీ బుక్స్, పద్యాలు, భారత రాజ్యాంగం, వార్తా పత్రికలు వంటి పుస్తకాలను చదువుకుంటాం. వీటివల్ల మాకు జనవర్ నాలెడ్జ్, నైతిక విలువల వంటి వాటిపై అవగాహన కలుగుతుంది.