తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాను జయించిన డిప్యూటీ మేయర్‌ కుటుంబం - karimnagar city news

కరోనా వైరస్​ సోకిందంటే చాలు ఇక నూకలు చెల్లిపోయినట్లేనంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారంతో జనాలు ఈ పేరు వింటేనే గజగజ వణికిపోతున్నారు. కొవిడ్​ బారిన పడినవారిని అంటరానివారుగా చూస్తున్నారు. వైరస్‌ కన్నా సమాజం తీరే ఎక్కువ నొప్పిని కలిగిస్తోందని కరోనా నుంచి కోలుకున్న వారంటున్నారు. వైరస్ సోకితే భయపెట్టడం కాదు.. మనోధైర్యం కల్పించాలంటున్న కరీంనగర్‌ డిప్యూటీ మేయర్ కుటుంబంపై ప్రత్యేక కథనం.

karimnagar corporation deputy mayor family recovered from covid-19
కరోనాను జయించిన డిప్యూటీ మేయర్‌ కుటుంబం

By

Published : Jul 25, 2020, 6:13 PM IST

Updated : Jul 25, 2020, 6:57 PM IST

కరోనాను జయించిన డిప్యూటీ మేయర్‌ కుటుంబం

రాష్ట్రంలో మొట్టమొదట అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయిన జిల్లాగా పేరొందిన కరీంనగర్ జిల్లా కోలుకోవటంతో పాటు కట్టడిలోను ఆ పేరును నిలబెట్టుకొంది. అయితే ఇప్పుడు అత్యధిక కేసులు నమోదు అవుతున్న జిల్లాలో తన స్థానం చేర్చుకుంది. కరీంనగర్‌ జిల్లాలో ప్రస్తుతం 1031 మంది వైరస్ సోకిన వారు ఉన్నారు. దాదాపు అందరూ హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇదే తరహాలో వివిధ సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే డిప్యూటీ మేయర్‌ చల్లస్వరూప రాణితో పాటు భర్త హరిశంకర్‌ ఆ క్రమంలో ఇద్దరు పిల్లలు కూడా కరోనా బారిన పడ్డారు.

ఆందోళనకు గురికాకుండా ఉండాలి

అయితే తొలుత తాము భయాందోళనకు గురైనా ఆ తర్వాత కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఇచ్చిన మనోధైర్యంతో చాలా త్వరగా కోలుకున్నామని ఆ కుటుంబం చెబుతోంది. సాధారణంగా కరోనా ఎలా సోకుతుందోనన్న అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు ఆందోళనకు గురౌతున్నారని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని... అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో సోకినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. పాజిటివ్ వచ్చినప్పటికీ వైద్యుల సూచనలు పాటించడమే కాకుండా ఆందోళనకు గురికాకుండా ఉంటేనే త్వరగా కోలుకుంటారని చెబుతున్నారు. ప్రజలు వైరస్ పట్ల భయం కంటే అవగాహన పెంచుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.

రోగుల పట్ల వివక్ష కనిపిస్తోంది

ప్రస్తుతం కరోనా సోకిన వారిని ప్రభుత్వం హోం క్వారంటైన్​లో ఉండాలని సూచిస్తోంది. అయితే ప్రజల్లో మాత్రం కరోనా సోకిన వారి పట్ల వివక్షత కనిపిస్తోందని.. కోలుకున్న డిప్యూటీ మేయర్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. వైరస్ సోకిన వ్యక్తితో మాట్లాడితే తమకు వస్తుందనే అభిప్రాయం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా వైరస్‌ సోకే విధానాన్ని.. రాకుండా అడ్డుకొనే విధానం పట్ల అవగాహన ఉండాలన్నారు. తమకు వైరస్ సోకినప్పటికీ ఆందోళనకు గురికాకుండా గతంలో ఉన్నట్లే ఉన్నామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పిల్లలు తమకు కరోనా సోకిందనే విషయాన్ని మరిచిపోయి గడిపారని అందువల్లే వేగంగా కోలుకున్నారని వివరించారు.

ఇదీ చూడండి:వినాలంటే కొండెక్కాల్సిందే.. టెంట్​ వేయాల్సిందే!

Last Updated : Jul 25, 2020, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details