Karimnagar Central Library: ఇటీవల టీఎస్పీఎస్సీ పరీక్షలు రద్దుకావడంతో నిరుద్యోగుల్లో నెలకొన్న ఆందోళన తొలగించేందుకు కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయం నడుం బిగించింది. ఉద్యోగార్థుల సౌకర్యార్థం గ్రంథాలయాన్ని 24 గంటలపాటు తెరిచి ఉంచుతున్నారు. రద్దైన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించిన 20 మంది అభ్యర్థులు సహా వందలాదిమంది నిత్యం ఆ గ్రంథాలయానికి వచ్చి చదువుతున్నారు. వారికి అండగా నిలుస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ నిరుద్యోగులకు ఉచితంగా భోజనం అందిస్తోంది. త్వరలో ఉచితంగా ఇంటర్నెట్, వైఫై అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు:రాత్రివేళల్లో ఇక్కడికొచ్చి చదువుకునే యువతుల కోసం ప్రత్యేకంగా రెండు గదులు కేటాయించారు. వారి రక్షణ కోసం ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆరుబయట చదువుకునేవారికోసం హైమాస్లైట్లు బిగించారు. విద్యార్థుల కోసం కుర్చీలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వేళ 5 రూపాయల ప్రభుత్వ భోజన పథకం ద్వారా భోజనం అందిస్తున్నారు.
గ్రంథాలయంలో గదుల వైశాల్యం పెంచాలి: నిరుద్యోగులు, పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఆ గ్రంథాలయంలో 75 వేలకు పైగా పుస్తకాలు అందుబాటులోఉంచినట్లు గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ పొన్నం అనిల్ కుమార్ తెలిపారు. సిలబస్, పరీక్షల్లో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని మరిన్ని పుస్తకాలు తెప్పించనున్నట్లు చెప్పారు. పెరుగుతున్న చదువరుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని గ్రంథాలయంలో గదుల వైశాల్యం విస్తరించాలని విద్యార్థులు కోరుతున్నారు. స్మార్డ్సిటీ ప్రణాళికలో భాగంగా గ్రంథాలయంలో డిజిటల్ సేవలను మరింత ఉన్నతీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.