Karimnagar Cable Bridge: కరీంనగర్ మానేరు నదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి... నగరానికే కొత్త అందాన్ని తెచ్చిపెట్టబోతోంది. నాలుగేళ్ల కిందట రూ. 128కోట్లతో శంకుస్థాపన చేసిన బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటి వరకు రూ. 183కోట్లు ఖర్చు చేశారు. 680 మీటర్లు పొడవైన తీగల వంతెనను పూర్తిగా విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. కరీంనగర్ నుంచి వరంగల్, హైదరాబాద్ వెళ్లే వాహనాలకు సదుపాయం కల్పించడంతో పాటు... పర్యాటకులకు ఆహ్లాదం కలిగించనుంది. మానేరు నదిలో పడవ ప్రయాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో... రెండు వైపులా 220 మీటర్ల ఎత్తులో పైలాన్లు నిర్మించారు. పైలాన్లను 136 సెగ్మెంట్లతో అనుసంధానించారు. ఇప్పటికే ఆ సెగ్మెంట్ల తయారీ నిర్మాణం పూర్తి అయ్యింది. అంతే కాకుండా వంతెన సామర్థ్యాన్ని పరీక్షించే ప్రక్రియ పూర్తి అయ్యింది.
కరీంనగర్‌కే తలమానికం...
కేబుల్ బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియ 2021 నాటికి పూర్తి చేయాలని భావించినప్పటికి... అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పూర్తి కాలేదు. జనవరి 2020 నాటికే నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికి.. కరోనా, వర్షాల కారణంగా ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దక్షిణభారత దేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్న తీగల వంతెన.. కరీంనగర్ నగరానికే తలమానికంగా నిలవబోతుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.