Bus shelter Problems: కరీంనగర్‌లో బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరం నుంచి ఇరుపొరుగు ప్రాంతాలకు వెళ్లేందుకు వందలాది మంది వివిధ చోట్ల వేచి ఉంటారు. సుమారు 16ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం బస్సులు నిలుపుతున్నారు. ప్రస్తుతం సర్కస్ గ్రౌండ్ వద్ద జగిత్యాల వెళ్లే వైపు తప్ప మరెక్కడా షెల్టర్లు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఎండకు, వర్షానికి ఎక్కడా నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. బస్‌షెల్టర్లు లేకపోవడం వల్ల ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవమేనని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఖుస్రోషాఖాన్ అంగీకరించారు. స్మార్ట్‌సిటీ నిధుల ద్వారా సదుపాయాలు కల్పించాలని ఉన్నతాధికారులకు విన్నవించామని అందుకు వారు ఒప్పుకున్నారని వెల్లడించారు. వీలైనంత త్వరగా బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
స్మార్ట్‌సిటీ నిధులతో నగరంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్‌బేలు నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నట్లు మేయర్ సునీల్‌రావు తెలిపారు. ఇప్పటికే ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించామని వెల్లడించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోడ్డు విస్తరణ చేపడుతున్నట్లు వివరించారు. బస్ షెల్టర్లు నిర్మించాలని ఆర్టీసీ అధికారులు కోరినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని సునీల్ రావు స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీలో భాగంగా రహదారుల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉండటంతో కొత్తగా బస్టాపులు నిర్మించడం నగరపాలక సంస్థకు ఇబ్బందిగా మారింది.