తెలంగాణ

telangana

ETV Bharat / state

నేను లంచగొండిని కాదని చెప్పుకున్నా.. సమస్యేనా

ఓ ప్రభుత్వ ఉద్యోగి తాను లంచగొండిని కాదని.. బోర్డు పెట్టుకోవడం వల్ల కొత్త సమస్యలు ఎదుర్కోవల్సిన పరిస్థితి ఏర్పడింది. లంచం తీసుకోనని బోర్డు పెట్టినంత మాత్రానా.. గతంలో సంపాదించిన సొమ్ము గురించి ఏంటని తోటి ఉద్యోగులే కాకుల్లా పొడవటం భరించలేకుండా తయారైంది. పర్యవసానంగా తన ఆస్తుల గురించి విచారణ జరిపించమంటూ.. స్వయంగా సదురు ఉద్యోగే అనిశా అధికారుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నేను లంచగొండిని కాదు

By

Published : Nov 19, 2019, 5:51 AM IST

Updated : Nov 19, 2019, 11:52 AM IST

నేను లంచగొండిని కాదు

కరీంనగర్‌ విద్యుత్‌ ఎస్‌ఈ కార్యాలయంలో కమర్షియల్‌ ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్న అశోక్‌కుమార్‌ తన సీటు వద్ద నేను లంచగొండిని కాదని పెద్ద బోర్డు ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. లక్ష రూపాయలకు పైబడి ఖర్చు అయ్యే పనులన్నింటికీ ఏడీఈ అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఆయా పనులకు ఏ అనుమతి పొందాలన్నా.. లంచం చెల్లించుకోవల్సిందేనన్న అభిప్రాయం ప్రచారంలో ఉంది.

అన్నింటికి ఆశే కారణం...

ఈ క్రమంలో నగర ఏడీఈ నుంచి ఈ పోస్టుకు బదిలీ అయిన అశోక్‌ విధుల్లోకి చేరిన తర్వాత కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. ఏ పని కోసం వచ్చినా లంచం ఇవ్వడానికి యత్నించడం.. బదులుగా తాను లంచం తీసుకోనని వారికి నచ్చజెప్పడం ఆనవాయితీగా మారింది. అయినప్పటికీ కొత్తగా వచ్చే వారంతా మళ్లీ లంచం ఇవ్వడానికి యత్నిస్తుండటం వల్ల నేను లంచగొండిని కాదని బోర్డు ఏర్పాటు చేసుకున్నారు. మనిషిలో డబ్బు సంపాదించాలన్న ఆశే లంచగొండిగా మారడానికి కారణమౌతోందని ఆయన అభిప్రాయం. తాను ఎవరిని నొప్పించడానికో అప్రతిష్ఠ పాలు చేయడానికో ఈ బోర్డుపెట్టలేదని అశోక్ స్పష్టం చేశారు.

సరికొత్త చిక్కులు..

నేను లంచగొండిని కాదని బోర్డు పెట్టడం వల్ల సమస్యలు తగ్గిపోతాయని భావించిన అశోక్​కి సరికొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. నువ్వు లంచగొండిని కాదంటే మేము లంచాలు తీసుకుంటామా అని బెదిరింపు ఫోన్లు మొదలయ్యాయని వాపోయారు. తాను ఇలా బోర్డు పెట్టగా.. ఓ కలెక్టర్ ఫోన్‌ చేసి మెచ్చుకున్నారని తోటి ఉద్యోగుల్లో మాత్రం ఒకరిద్దరు మాత్రమే ఫోన్లు చేశారన్నారు.

విచారించండి..

తాను గతంలో అవినీతికి పాల్పడి ఇప్పుడు బోర్డు పెట్టడమేంటని అంటున్న దృష్ట్యా తన ఆస్తులపై విచారణ జరపాలని అనిశా అధికారులను ఆశ్రయించాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ఉద్యోగి లంచగొండి కాదని బోర్డు పెట్టడం ఆ శాఖలోనే వివాదాస్పదం కావడం వల్ల దాని పర్యవసానాలు ఎలా ఉంటాయన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇదీ చూడండి: 'ఆర్టీసీ సమ్మెపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి'

Last Updated : Nov 19, 2019, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details