హరితహారంలో పోలీసుల మొక్కవోని దీక్షకు ప్రతిఫలంగా కరీంనగర్‌లో మియావాకి చిట్టడివి తయారైంది. శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాదు. చెట్ల పెంపకంలోను పట్టుదలతో కరీంనగర్ పోలీసులు ముందుకు సాగిన తీరు పలువురిని ఆకర్షిస్తోంది. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న కరీంనగర్ జిల్లాలో చిట్టడవుల పెంపకానికి ఊతమివ్వాలనే పోలీసుల ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. రాష్ట్రస్థాయి అధికారుల మన్ననలు అందుకుంటోంది.
చిట్టడువుల జిల్లాగా మార్చేందుకు..
మొక్కల్ని పెంచడమంటే సాదాసీదాగా నాటి.. వదిలేస్తారు. కానీ.. కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అలా చేయలేదు. నాటిన మొక్కల పట్ల ప్రత్యేక చొరవ చూపారు. మొక్కలు పెంచడంలో విదేశీ పరిజ్ఞానాన్ని ఆచరించారు. పర్యావరణహితుడిగా పేరొందిన జపాన్ శాస్త్రవేత్త అకీరా మియావాకి చెప్పిన విధానాల్ని పాటించారు. తొలుత బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావుతో పాటు వివిధ పాఠశాలల విద్యార్దులతో మొక్కలు నాటించారు. ఆ తర్వాత తీసుకున్న చర్యలో భాగంగా కరీంనగర్‌లో అనతికాలంలోనే సరికొత్త చిట్టడవిని సృష్టించారు. చిట్టడవుల ప్రాధాన్యతను భావితరాలు గుర్తించాలనే ఆలోచనతో కరీంనగర్ పోలీసులు మియావాకీ విధానాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు.
ఆధునిక విధానంలో మొక్కల పెంపకం
పట్టణంలోని సిటీ పోలీస్ శిక్షణా కేంద్రంలో ఉన్న ఎకరం స్థలంలో గతేడాది హరితహారంలో భాగంగా 12 వేల మొక్కల్ని నాటారు. జపాన్ వృక్ష శాస్త్రవేత్త అకీరా మియావాకి దశాబ్దాల కిందట చిట్టడువులను పెంచడానికి రూపొందించిన విధానాన్ని అమలు చేసి.. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అటవీశాఖ సహకారంతో 12 వేల మొక్కల్ని నాటి.. ఏడాది కాలంలోనే ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రతీ ఏడాది జిల్లాలో ఆయా శాఖలు హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం, పోలీసుశాఖ తరపున వీలైనన్ని ఎక్కువ మొక్కల్ని నాటి, పెంచాలనే సంకల్పంతో గతేడాది అన్ని ఠాణాల్లో విరివిగా మొక్కలు నాటించారు. అంతేకాదు.. నాటిన మొక్కల్ని జాగ్రత్తగా ఎదిగేలా చర్యలు తీసుకున్నారు.