తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​ బల్దియాలో గోల్ మాల్ 'లెక్కలు'... - Irregularities in karimnagar corporation

ఆస్తిపన్ను వసూళ్ల వ్యవహారంలో కొందరు రెవెన్యూ ఉద్యోగులు అనుసరిస్తున్న తీరుతో నగరపాలక అభాసుపాలవుతోంది. అక్రమాలు జరుగుతున్నా.. నామమాత్రపు చర్యలతో ఎప్పటిలాగే విధులను కేటాయిస్తున్నప్పటికీ ఆ కొందరిలో మార్పు రావడం లేదు. రెండు, మూడేళ్లకు ఒకసారి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం, వసూలు చేసిన మొత్తాన్ని స్వాహా చేస్తుండటం..తీరా లెక్కల్లో తేడా వస్తుండటంతో ఈ బాగోతం బయట పడి ఒక బిల్‌ కలెక్టర్‌ సస్పెండ్‌ అయ్యారు.

Irregularities in Karimnagar corporation in Telangana
కరీంనగర్​ బల్దియాలో గోల్ మాల్ 'లెక్కలు'

By

Published : Sep 19, 2020, 2:56 PM IST

కరీంనగర్‌ నగరపాలక సంస్థలో రెవెన్యూ విభాగం ద్వారా ఆస్తిపన్ను వసూళ్ల బాధ్యతలు చేపడుతుంది. మొత్తం రెవెన్యూ వార్డులు 18 ఉండగా అందులో 17మంది బిల్‌ కలెక్టర్లు, విలీన గ్రామాల్లో 11మంది బిల్‌ కలెక్టర్లు పని చేస్తున్నారు. వీరంతా ఇంటినంబర్ల కేటాయింపు, ఆస్తిపన్ను మదింపు, పేర్ల మార్పిడితో పాటు ప్రధానంగా ఆస్తిపన్ను వసూళ్ల చేస్తున్నారు. ఏటా ఆస్తిపన్ను వసూళ్లకు ఈమాస్‌ యంత్రం ద్వారా రసీదులు ఇచ్చి నగదు రూపంలో పన్నులు తీసుకుంటున్నారు. వసూలు చేసిన ఆస్తిపన్ను మొత్తాన్ని ఎప్పటికప్పుడూ క్యాష్‌ కౌంటర్‌లో అప్పగించి రసీదు తీసుకోవాల్సి ఉంటుంది.

లోతుగా విచారణ

ఆస్తిపన్ను వసూలు చేసి సొంతానికి వాడుకుంటున్నట్లు బయట పడుతున్న విషయాన్ని కమిషనర్‌ వల్లూరు క్రాంతి తీవ్రంగా పరిగణించారు. మూడేళ్ల కిందట ఇలాగే నగదును సొంతానికి మళ్లించుకున్న విషయంలో కొందరు బిల్‌ కలెక్టర్లు సస్పెండ్‌ అయ్యారు. అదే తరహాలో మళ్లీ ఆన్‌లైన్‌, స్వైపింగ్‌ ద్వారా ఆస్తిపన్ను సేకరించి నగరపాలక సంస్థకు చెల్లించకుండా సొంత ఖాతాకు మళ్లించుకోవడంపై విచారణ ప్రారంభించారు. నగరపాలక సంస్థ స్వైపింగ్‌ మిషన్లు కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు వినియోగించి ఏమేర ఆస్తిపన్ను వసూలు చేశారు? వసూలు చేసిన మొత్తం జమ చేశారా లేదా అనేదీ ఆరా తీస్తున్నారు. వీటి వివరాలను బ్యాంకు అధికారుల నుంచి రికార్డులు తెప్పిస్తున్నట్లు సమాచారం. ఆస్తిపన్ను గోల్‌మాల్‌ విషయంలో లోతుగా తవ్వితే మరిన్ని అక్రమాలు బయటకు వచ్చే అవకాశముంది. ఇందులో ఎంతమంది బాధ్యులు ఉన్నారనే విషయం కూడా తెటతేల్లం కానుంది.

రూ.16.50లక్షలు సొంత ఖాతాకు మళ్లింపు

నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆస్తిపన్ను వసూలు చేసి నగరపాలక ఖాతాలో జమ చేయకుండా స్వైపింగ్‌ మిషన్‌ ద్వారా బిల్‌ కలెక్టర్‌ సొంత ఖాతాకు రూ.16.50లక్షలు మళ్లించుకున్నారు. నగరపాలికలో పని చేస్తున్న శశికుమార్‌ అనే బిల్‌ కలెక్టర్‌ తేదీ 1-4-2020 నుంచి 9-9-2020వరకు స్వైపింగ్‌, ఈమాస్‌ ద్వారా ఆస్తిపన్ను వసూలు చేశారు. ఈ వ్యవధిలో మొత్తం రూ.16,50,864 మొత్తాన్ని క్యాష్‌ కౌంటర్‌లో లెక్క చూపించాల్సి ఉండగా చూపకపోవడం, వెంటనే రూ.3,45,220 నగరపాలిక ఖాతాల్లో జమ చేయడం, మిగతా రూ.13,05,644 విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నట్లు గుర్తించి విచారణ చేపట్టారు. ఈ మేరకు శశికుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంతే మొత్తం కాకుండా రూ.లక్షల్లో సొంతానికి వాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

స్వైపింగ్‌ చెల్లింపులపై లెక్కలేవీ?

ఇంటి యజమానుల నుంచి ఆస్తిపన్ను తీసుకొని రసీదు ఇస్తుండగా ఆ రసీదుపై నగదు, కార్డు అని ముద్రితమై ఉంటుంది. ఈ విషయాన్ని ఇంటి యజమానులు స్పష్టంగా గుర్తించకపోవడంతో, రసీదు ఇస్తున్నారనే ధీమాతో ఉండటంతో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆన్‌లైన్‌, స్వైపింగ్‌ మిషన్‌ ద్వారా లావాదేవీలు జరిపే సమయంలో రసీదు నంబర్‌ కచ్చితంగా ఆస్తిపన్ను రసీదుపై ఉంటుంది. మరొక రసీదు సదరు బిల్‌ కలెక్టర్లు లెక్కలు అప్పగించే సమయంలో స్వైపింగ్‌ వివరాలను క్యాష్‌ కౌంటర్‌లో అప్పగించాలి. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశారని, నగదు లెక్కించుకొని వదిలేస్తుండటంతోనే అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఈ లెక్కలు చూసుకోవడానికి బ్యాంకు, సీడీఎంఏ నుంచి వివరాలు వచ్చే వరకు బయటకు రాకపోవడంతో రూ.లక్షల్లో తేడాలు వచ్చి చిక్కుల్లో పడే పరిస్థితి ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details