తెలంగాణ

telangana

ETV Bharat / state

పారాసిటమాల్‌తో మాయ... బయలుదేరే ముందే వారికి కరోనా

ఇండోనేషియా వాసులు సుమారు 17 రోజుల క్రితం కరీంనగర్​లో అడుగుపెట్టారు. వారికి కరోనా ఉందని ముందే తెలిసినప్పటికీ విమానం దిగే ముందు... ఆ తర్వాత పారాసిటమాల్ మాత్ర వేసుకుని అధికారులను మాయ చేశారు. వీరి వల్ల తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 500 మందికి పైగా కరోనా అనుమానితులున్నట్లు సమాచారం.

పారాసిటమాల్​ గోలితో ఇండోనేషియన్ల మాయ
పారాసిటమాల్​ గోలితో ఇండోనేషియన్ల మాయ

By

Published : Mar 26, 2020, 7:01 AM IST

కరీంనగర్​ జిల్లా కేంద్రానికి.. ఇండోనేసియా నుంచి 17 రోజుల కిందట సుమారు పదిమంది విదేశీయుల పర్యటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. వచ్చిన వారందరికీ కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. ఫలితంగా వారితో పాటు తిరిగిన మరో వ్యక్తి కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. తెలంగాణలోని దాదాపు 500 మందిలో... కొందరిని హోం క్వారంటైన్‌ చేశారు. మరికొందరిని వివిధ ఆస్పత్రులకు పంపించారు. ఈనెల 9న ఇండోనేసియా నుంచి పదిమంది దిల్లీలో దిగారు. అప్పటికే వారిలో కొందరు తీవ్రమైన జ్వరంతో ఉన్నారు. విమానాశ్రయంలో పట్టుబడితే ఆస్పత్రిలో చేరుస్తారన్న ఉద్దేశంతో విమానం దిగడానికి ముందే నాలుగైదు పారాసిటమాల్‌ మాత్రలు వేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

యథేచ్ఛగా రాజధాని వీధుల్లో...

కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారంతా యథేచ్ఛగా దిల్లీలోని అనేక ప్రాంతాల్లో తిరిగారు. 13న సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి 14న రామగుండంలో దిగారు. అక్కడ మత పెద్దలతో మాట్లాడి ప్రైవేట్ వాహనంలో కరీంనగర్‌కు వెళ్లారు. అక్కడికెళ్లాక ఒకరికి దగ్గు బాగా రావడం వల్ల వీరిని పరీక్షించారు. ఈ క్రమంలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. మిగతావారిని కూడా పరీక్షించగా కరోనా వైరస్‌ ఉందని స్పష్టమైంది. తెలంగాణతో పాటు ఏపీ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇండోనేసియా వాసులతో ఇద్దరు గైడ్లు సహా ఎస్‌9 బోగీలో 82 మంది ప్రయాణించారని తేలింది. వారిలో కొందరు గద్వాల, కర్నూలు, తిరుపతి తదితర ప్రాంతాల్లో దిగినట్లు వెల్లడైంది.

సుమారు 300కి పైగా క్వారంటైన్ !!

సీఎం కేసీఆర్‌ దీన్ని తీవ్రంగా పరిగణించారు. రామగుండం పోలీసు కమిషనర్‌ సత్యనారాయణ, కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ రెండు కమిషనరేట్ల పరిధిలో ఇప్పటివరకు 300 మందిని హోం క్వారంటైన్‌ చేశారు. సుమారు 130 మందిని ప్రత్యేక వార్డులకు తరలించారు. విదేశీయులతో పాటు ప్రయాణించిన మరో ఇద్దరు కానిస్టేబుళ్లనూ క్వారంటైన్‌లో ఉంచారు. ప్రైవేట్ వాహనం డ్రైవర్‌ క్వారంటైన్‌లో ఉండటానికి నిరాకరించాడు. ఫలితంగా అతనిపై కేసు నమోదు చేసి క్వారంటైన్‌కు తరలించారు. సంపర్క్ క్రాంతిలో ప్రయాణించినవారిని, వారి వెంట తిరిగినవారిని వెతికి పట్టుకుని నిఘా ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియలో దాదాపుగా వెయ్యి మంది పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. బాధితుల 14 రోజుల క్వారంటైన్‌ ఈనెల 28తో ముగుస్తుంది. అప్పటి వరకు వీరిలో ఎవరికీ వైరస్‌ లేదని తేలిపోతే పెద్ద ముప్పు తప్పినట్లేనని రామగుండం సీపీ సత్యనారాయణ ‘పేర్కొన్నారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details