రాష్ట్రంలో ఈ నెల 30న జరగనున్న హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌కు ఈసీ లేఖ రాసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. హుజూరాబాద్ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు దళితబంధు అమలును నిలిపివేయాలని.. ఎన్నిక తర్వాత యథావిధిగా కొనసాగించవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల్లోగా ఇందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసింది.
నిధులు జమ చేసే ప్రక్రియను నిలిపివేస్తున్నాం: కలెక్టర్
హుజూరాబాద్ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు దళితబంధు నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే ప్రక్రియను నిలిపివేయనున్నట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో వివిధ పార్టీలకు చెందిన 30 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 30న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.
పైలట్ ప్రాజెక్టుగా వాసాలమర్రిలో..
తెలంగాణలో వెనకబడిన దళితవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కార్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించింది. మొదట పైలట్ ప్రాజెక్టుగా నల్గొండ జిల్లా వాసాలమర్రిలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా.. ఉత్పత్తి, తయారీ రంగాలను ప్రోత్సహించాలని సర్కార్ యోచన చేసినప్పటికీ.. లబ్ధిదారులు ఎక్కువగా సేవారంగానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా 70 శాతానికి పైగా లబ్ధిదారులు ట్రాక్టర్, కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
హుజూరాబాద్‌లో దళితబంధును ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే రూ.2 వేల కోట్లు విడుదల చేసింది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం... హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 20 వేల ఎస్సీ కుటుంబాలున్నాయి. ఇప్పుడు దళితబంధు కోసం లెక్కలు వేయగా, దాదాపు 25 వేల కుటుంబాలున్నట్లు తేలింది. లబ్ధిదారుల దరఖాస్తులను అధికారులు పరిశీలించి నిధులు మంజూరు చేస్తున్నారు. ఇప్పటివరకు 18 వేల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున నిధులు జమయ్యాయి. స్వయం ఉపాధి పథకానికి అధికారులు ఆమోదం తెలిపిన తరువాత ఆ నిధులను వినియోగించుకునే వీలుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో దళితబంధుకు బ్రేక్ పడింది.
గతంలో ఈసీకి లేఖ రాసిన సుపరిపాలనా వేదిక
గతంలో హుజూరాబాద్ ఉపఎన్నిక ముగిసే వరకు దళితబంధు పథకం అమలు నిలిపేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న దళితబంధు పథకం మంచిదే అయినా.. హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆ నియోజవర్గంలోనే తొలుత అమలుచేస్తున్నారని పలు రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయని పద్మనాభరెడ్డి తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పైన ఉందన్నారు.
ఇదీ చదవండి: CM KCR: ఏడేళ్లలో దళితబంధుకు రూ.1.7 లక్షల కోట్లు: కేసీఆర్