కరీంనగర్ జిల్లాలో మానేరు నదితో పాటు పలు మండలాల మీదుగా వాగులు పారుతున్నాయి. అయిననూ ప్రవాహంలోని ఇసుకను తీసి పట్టణాలకు తరలించి ఒక్కో ట్రిప్పునకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు అమ్ముతున్నారు. ఇంచుమించుగా జిల్లా వ్యాప్తంగా నిత్యం 4 వందల నుంచి 5 వందల ట్రాక్టర్ ట్రిప్పుల వరకు అక్రమ రవాణా జరుగుతున్నట్లు అంచనా. రీచ్‌ల నుంచి టోకెన్ ద్వారా తీసుకెళ్లే ఇసుకకు చెల్లించే పన్ను కిలో మీటరు ప్రాతిపదికన ఉంటుంది. తక్కువలో తక్కువ రూ.1150 దగ్గర ప్రారంభమై రూ.2500 వందల వరకు ఉంటుంది. ఈలెక్కన ఒక్కో ట్రిప్పునకు సగటున రూ.2వేల చొప్పున లెక్కేస్తే 500 ట్రిప్పులకు నిత్యం రూ.10 లక్షల వరకు ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది.
కొందరు ట్రాక్టర్ యజమానులు ఇద్దరు డ్రైవర్లను నియమించుకుని 24గంటల పాటు రవాణా కొనసాగిస్తూ ఆరు ట్రిప్పులు విక్రయిస్తున్నారు. శిక్షణ లేని డ్రైవర్లు ఉండటం వల్ల ఇష్టారీతిన నడుపుతూ గ్రామీణులను భయపెడుతున్నారు. ఇటీవల బొమ్మకల్‌లో ఓ ఇంటి గోడను ట్రాక్టరు ఢీకొనడం వల్ల డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గుట్టుచప్పుడు కాకుండా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవడం వల్ల వాగులు వంకల్లో నీరు పారుతోంది. ఇసుక మేట కనిపిస్తే చాలు అక్కడి నుంచి తోడి తరలిస్తున్నారు.
జమ్మికుంట మండలం తనుగుల మానేరు వాగు నుంచి ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు
అభివృద్ధి పనుల పేరు చెప్పి అక్రమ రవాణా
శ్మశానవాటిక, డంపింగ్‌యార్డుల నిర్మాణాలకని చెప్పి ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఎవరైనా అధికారి వచ్చి ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకుంటే సంబంధిత యజమాని గ్రామంలోని ప్రజాప్రతినిధి ద్వారా డంపింగ్‌యార్డు నిర్మాణానికని ఫోన్ చేయించి తప్పించుకుంటున్నారు.
బొమ్మకల్‌లో మానేరు వాగు నుంచి ఉదయం వేళ ట్రాక్టర్ ద్వారా ఇసుకను తరలిస్తున్న దృశ్యం
* గన్నేరువరం మండలంలో బిక్కవాగు నుంచి 24 గంటలూ ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. గంగాధర మండలంలోని వెంకటయ్యపల్లి వాగు నుంచి ఇసుక తరలించుకుపోతున్నా అక్కడ అడిగే దిక్కే లేదూ. కొత్తపల్లి, తిమ్మాపూర్ మండలాల్లో మొన్నటి వరకూ ఇసుకను హైదరాబాద్‌కు తరలించి సొమ్ము చేసుకున్నారు. ఇటీవల మానేరు బ్యాకు వాటర్ నిలువ ఉండటం వల్ల.. ఇసుక అక్రమ రవాణాకు కొంత బ్రేక్ పడినట్లయింది.