తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్పంచ్ అంటే ఇలా ఉండాలి.. ఊరికి కావాల్సినవన్నీ సొంత డ‌బ్బుల‌తోనే..

Sarpanch Done Works With Own Money : గ్రామాల్లో మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల‌న్నా.. ఇత‌ర అభివృద్ధి ప‌నులు జ‌ర‌గాల‌న్నా.. నిధులు ముఖ్యం. గ్రామ‌ స్థాయిలో అవి మంజూర‌వ‌డంలో ఆల‌స్యం కావొచ్చు. అలాంట‌ప్పుడు ఆ ప‌నులు అర్ధాంత‌రంగా ఆగిపోతాయి. కానీ క‌రీంన‌గ‌ర్ జిల్లా శాల‌ప‌ల్లి-ఇందిరాన‌గ‌ర్ గ్రామంలో మాత్రం ఇలాంటి ప‌రిస్థితి ఉండ‌దు. కార‌ణం.. ఈ ఊరి స‌ర్పంచే తన సొంత నిధులు వెచ్చించి ప‌నులు జ‌రిగేలా చూస్తున్నారు.

Sarpanch Done Works With Own Money
Sarpanch Done Works With Own Money

By

Published : Apr 4, 2023, 1:09 PM IST

Sarpanch Done Works With Own Money : ప్రభుత్వాలు కేటాయించిన నిధులతో సర్పంచ్​లు గ్రామంలో అభివృద్ధి పనులు చేయటం సహజం. వాటిల్లో సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు డ‌బ్బులు మంజూరు చేయాల‌ని ద‌ర‌ఖాస్తులు అందిస్తుంటారు. అవి మంజూరైతేనే ప‌నులు ప్రారంభిస్తారు. లేక‌పోతే అవి అక్క‌డితోనే ఆగిపోతాయి. కానీ.. క‌రీనంగ‌ర్ జిల్లా శాలపల్లి-ఇందిరానగర్ స‌ర్పంచ్ కోడిగూటి శారద రూటే వేరు. పైనుంచి వ‌చ్చే న‌గదు కోసం చూడ‌కుండా... గ్రామ‌స్థుల అవ‌స‌రాల‌ను గుర్తించి సొంత నిధుల‌తో ప‌నులు చేయిస్తున్నారు. రూ.వందలు, రూ.వేలు కాదు.. ఏకంగా రూ.లక్షలు వెచ్చించి ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

కరీంనగర్‌ జిల్లా శాలపల్లి-ఇందిరానగర్‌ గ్రామ జనాభా సుమారు 2400 మంది. దాదాపు 650 కుటుంబాలుండ‌గా.. 1600 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 10 వార్డులున్నాయి. గ్రామ సర్పంచ్, పంచాయతీ పాలక వర్గ సభ్యులతో కలిసి గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప‌నులు చేయిస్తున్నారు. బ‌డి ద‌గ్గ‌ర నుంచి వైద్య సాయం వ‌ర‌కు అన్ని విష‌యాల్లో ఇత‌ర గ్రామాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు న‌డుం బిగించారు. దీనికోసం విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడమే కాకుండా ఆర్థిక ప‌ర‌మైన సాయం సైతం అంద‌జేస్తున్నారు. గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చేరిన ప్రతి విద్యార్థికీ నెల నెలా రూ.500 చొప్పున ఉపకార వేతనాన్ని అందజేస్తున్నారు. ఇలా 30 మంది విద్యార్థులకు అందిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్ర రూపు రేఖలు మార్చారు. రూ.6.50 లక్షలతో కార్పొరేట్‌ స్థాయిలో దీనిని తీర్చిదిద్దారు.

కరోనా విపత్తులోనూ గ్రామీణులకు ఆమె అండగా ఉన్నారు. రూ.4.50 లక్షల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసి దాన్ని బియ్యంగా మార్చి ప్రతి కుటుంబానికి 25 కేజీల చొప్పున‌ అందించారు. ఇప్పటికీ తాను పండించిన పంట దిగుబడిని నిరుపేదలకు అందిస్తూ వారికి ఆసరాగా నిలుస్తున్నారు.

ఆరోగ్య అవసరాలకు సంబంధించి గ్రామానికి రూ.6.25 లక్షలతో ప్రత్యేక అంబులెన్స్‌ను కొనుగోలు చేశారు. ఉచితంగా సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉన్నత చదువుల కోసం సమీప పట్టణాలకు వెళ్లే విద్యార్థుల ఇబ్బందులు తీర్చ‌డానికి బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. త్వరలోనే రూ.7 లక్షల విలువైన నూతన బస్సు అందుబాటులోకి వస్తుందని ఆమె చెప్పారు.

"రూ.3 లక్షల వ్యయంతో విద్యార్థులకు ఇటీవల నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించాం. గతంలో పిల్లలు పాఠశాలకు వెళ్లాలన్నా, ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు సమీప ప్రాంతాల్లోని ఆసుప‌త్రుల‌కు వెళ్లాల‌న్నా ఇబ్బందులుండేవి. ప్ర‌స్తుతం అవి తీరిపోయాయి." అని స‌ర్పంచ్ శార‌ద తెలిపారు.

ఇత‌ర గ్రామాల్లో సర్పంచులు ఎలా ఉంటారో కానీ.. తమ గ్రామ స‌ర్పంచ్, వార్డు మెంబర్లు మాత్రం ప్రజల మనసులు గెలుచుకునేందుకు యత్నిస్తున్నారని గ్రామ‌స్థులు మాధవి, శ్రీనివాస్​లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి..

ఎంపీపీగా ఉదయం అధికారిక కార్యక్రమాల్లో.. కూలీగా మధ్యాహ్నం పొలం పనుల్లో..

Sarpanch Suicide: అప్పులు చేసి అభివృద్ధి చేశాడు.. బిల్లులు రాక ఉసురు తీసుకున్నాడు

ABOUT THE AUTHOR

...view details