హుజూరాబాద్ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas value ) తనకు సొంత వాహనం లేదంటూ నామినేషన్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయన కుమారుడి పేరు తారక రామారావు, కూతురు పేరు సంఘమిత్రగా వివరించారు. శ్రీనివాస్ ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ రాజనీతి శాస్త్రం, ఉస్మానియా న్యాయకళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు.
ఆస్తుల వివరాలు
నామినేషన్ వేసే సమయానికి ఆయన వద్ద కేవలం 10 వేల నగదు, ఆయన భార్య వద్ద 5 వేల నగదు మాత్రమే ఉన్నాయి. తన పేరిట నాలుగు, భార్య పేరిట మూడు బ్యాంకు ఖాతాలున్నాయి. వీటిల్లో శ్రీనివాస్‌కు 2.82 లక్షల నగదు డిపాజిట్లున్నాయి. భార్య వద్ద 25 తులాల బంగారు ఆభరణాలుండగా.... వాటి విలువ సుమారు 12 లక్షలుగా పేర్కొన్నారు. వీణవంకలో సొంతిల్లు, భార్య పేరిట హుజూరాబాద్‌లో 12 గుంటల స్థలం ఉన్నాయి. శ్రీనివాస్ యాదవ్‌పై ఓయూ, కొల్లాపూర్, షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ముడు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
తొలి నామినేషన్
ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం అధికారికంగా వెలువడటంతో తొలిరోజునే తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి తదితరులతో కలిసి ఆయన హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం 12.50కి నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి రవీందర్‌రెడ్డికి అందించారు. అంతకుముందు శ్రీనివాస్ ఇల్లందకుంటలోని సీతారామాలయంలో పూజ చేయించారు. తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి బయలుదేరారు.