తెలంగాణ

telangana

ETV Bharat / state

Huzurabad by election 2021: గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థుల ధీమా.. ఎవరు ఏమంటున్నారంటే..! - తెలంగాణ వార్తలు

హుజూరాబాద్‌లో ప్రచారం(Huzurabad by election campaign 2021) ఊపందుకుంది. అధికార, విపక్షాల గెలుపు కోసం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటం వల్ల మూడు పార్టీలు పదునైన విమర్శలకు ఎక్కుపెట్టాయి. ఎవరికి వారు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఉపఎన్నిక పట్ల ప్రధాన పార్టీల అభ్యర్థుల మనోగతం ఇలా..

urabad by election 2021, huzurabad election campaign
హుజూరాబాద్ ఉపఎన్నికలు, హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం

By

Published : Oct 24, 2021, 7:02 AM IST

ఉద్యమాల గడ్డ... చైతన్యవంతమైన ప్రాంతం... హుజూరాబాద్‌... ఉపఎన్నిక నేపథ్యంలో(Huzurabad by election 2021) ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బరిలో నిలిచిన మూడు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు. పార్టీ విధానాలను ప్రజల ముందుంచుతూ తమను ఆశీర్వదించమంటూ అభ్యర్థిస్తున్నారు(Huzurabad by election campaign 2021). రసవత్తరంగా సాగుతున్న ఈ ఉపసమరంలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాను గెలిస్తే పేద ప్రజలు గెలిచినట్టేనని తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ అంటుండగా హుజూరాబాద్‌ ప్రజల ఆత్మగౌరవ బావుటాను ఎగురవేస్తానని భాజపా అభ్యర్థి ఈటల విశ్వాసం ప్రకటించారు. తాను విజయం సాధిస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భయంపుట్టి హామీలు అమలు చేస్తాయని కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ అన్నారు. విజయంపై ముగ్గురూ ధీమా వ్యక్తం చేశారు. ‘ఈనాడు-ఈటీవీభారత్’ ముఖాముఖిలో వారు తమ మనోగతాలను పంచుకున్నారు.

ఏమి చెప్పి మీరు ఓట్లు అడుగుతున్నారు..?

గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌:అభివృద్ధిని చూసి ఓటెయ్యండని ఓట్లు అడుగుతున్నా. కేసీఆర్‌ హయాంలో ఇంతటి సంక్షేమం చేరువవుతోంది. ఈ దేశంలో ఎకరానికి రూ.10 వేలు ఇచ్చిన రాష్ట్రం లేదు. భాజపా అధికారంలో ఉన్న చోట కూడా పింఛన్లు ఇంతలా అందడంలేదు. రాష్ట్రం తెచ్చిన పార్టీ.. సంక్షేమం, అభివృద్ధిని అందిస్తున్న పార్టీ, దేశంలో ఆదర్శ పాలనను చేరువ చేస్తున్న తెరాసను గెలిపించాలని కోరుతున్నా. ఉద్యమకారుడిని, విద్యార్థి నాయకుడిని, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా నాకు అవకాశం ఇవ్వాలంటూ ఓటు అడుగుతున్నాను.

ఈటల రాజేందర్‌:హుజూరాబాద్‌ ప్రజలకు ఈటల రాజేందర్‌ అనే వ్యక్తి ఎలాంటి మనిషో చాలా బాగా తెలుసు. ఇక్కడి ప్రజల కళ్లల్లో కదలాడిన వ్యక్తిని నేను. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి దాకా వారి ఇంట్లో మనిషి లెక్క మెదులుతున్నాను. అందుకే వారిని ధైర్యంగా ఓటు అడుగుతున్నాను. తెలంగాణ ఉద్యమంలో నా పోరాటాన్ని చూసిన ఓటర్లే మళ్లీ నన్ను గెలిపించుకుంటారనే ధీమాతో ఓట్లు అడుగుతున్నా.

బల్మూరి వెంకట్‌:రాష్ట్రస్థాయిలో విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి, పోరాడిన వ్యక్తిగా ఒక్క అవకాశాన్ని ఇవ్వమని కోరుతున్నాను. విద్యార్థుల పక్షాన నిలబడతా. రైతుల ఇక్కట్లు తెలిసిన వ్యక్తిగా అన్నదాత దగా పడకుండా చూస్తా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీల వైఫల్యాల్ని వివరిస్తూ ఓట్లు అడుగుతున్నా. ఎడ్యుకేషన్‌ హబ్‌, రెండు పడకగదుల ఇళ్లు.. ఇలా నెరవేర్చని హామీలను అర్థమయ్యేలా వివరిస్తున్నా.

ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? మీ విజయావకాశాలెలా ఉన్నాయి..?

గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌:ఊరూరా మంచి స్పందన లభిస్తోంది. ఈటల రాజీనామాకు అర్థం లేదని జనాలే అంటున్నారు. ఇన్ని పథకాలు పెట్టిన తరువాత వేరే పార్టీకి ఎందుకు ఓటు వేస్తామంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన బిడ్డకు అవకాశం ఇస్తామనే మాటల్ని బలంగా వినిపిస్తున్నారు. ఈటలకు రెండున్నరేళ్లు ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ రాజీనామా చేసి బాధ్యత నుంచి తప్పుకొన్నారు. తప్పకుండా విజయం సాధిస్తాననే సంపూర్ణ విశ్వాసం ఉంది. ‘మాకు పార్టీ ముఖ్యం. వ్యక్తులు ముఖ్యం కాద’ని ప్రజలే బాహాటంగా చెబుతున్నారు.

ఈటల రాజేందర్‌:ఊరూరా బ్రహ్మరథం పడుతున్నారు. నాకు జరిగిన కష్టాన్ని, నష్టాన్ని వారి బాధగా స్వీకరిస్తున్నారు. అయ్యో బిడ్డకు ఇంత అన్యాయం జరిగిందా..? అంటూ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. నా రాజీనామా వల్లనే నియోజకవర్గానికి మరిన్ని ప్రగతి ఫలాలు అందుతున్నాయి. నేను ఆనాడు మంత్రిగా ఉండి కూడా అభివృద్ధి చేశా. రాజీనామా చేసిన తరువాత కూడా పింఛన్లు, రేషన్‌కార్డులు, దళితబంధును ఇవ్వడానికి నేనే కారణమయ్యానని ప్రజలు అమితంగా నన్ను ఆదరిస్తున్నారు.

బల్మూరి వెంకట్‌:ఎక్కడికి వెళ్లినా.. గెలువు బిడ్డా అని ప్రతి తల్లీ ఆశీర్వదిస్తోంది. ప్రతి చెల్లీ మంగళహారతి పడుతోంది. తమ ఇంటి బిడ్డగా ఆదరిస్తూ సహకరిస్తున్నారు. దళితబంధు విషయంలో ఆ రెండు పార్టీలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణల్ని ఓటర్లే మాకు చెబుతున్నరు. రైతుబంధు ఇస్తున్నప్పుడు దళితబంధు ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ‘గల్లీలో కుస్తీ-దిల్లీలో దోస్తీ’ అనేలా తెరాస, భాజపాల వ్యవహారముందని చెబుతున్నారు. కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధిని ప్రజలు మరవలేదు.

మీకే ఎందుకు ఓటు వెయ్యాలంటే ఏంచెబుతారు.?

గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌:ఉద్యమకారుడికి, పేదవాడికి కేసీఆర్‌ టికెట్‌ ఇచ్చారు. నేను గెలిస్తే ఈ నియోజకవర్గంలోని పేదలందరూ గెలిచినట్టుగా భావిస్తాను. 80 శాతం ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రతినిధిగా మారుతాను. రాష్ట్రంలో అధికారమున్న పార్టీ కనుక వందల కోట్ల నిధుల్ని తెప్పించి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాను. ఈటల ముఖ్యమంత్రిని కలవలేడు. అదే నేను గెలిస్తే నేరుగా సీఎంను కలిసి ఇక్కడి అవసరాల్ని తీర్చేలా నిధుల్ని తీసుకురాగలుగుతాను. ఉద్యమంలో జైలుకు వెళ్లివచ్చా. త్యాగాలు చేశాను కాబట్టి నన్ను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను.

ఈటల రాజేందర్‌:ఆరుసార్లు ఇక్కడి ప్రజల బిడ్డగా గెలిచాను. అన్నిరంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. తెలంగాణ ఉద్యమంలో నా పోరాటం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కేసీఆర్‌ నాపట్ల అవలంబించిన వైఖరిని అందరూ గమనించారు. ఉద్యమాల గడ్డగా పేరొందిన హుజూరాబాద్‌ ఓటర్లు నన్ను గెలిపించి రాష్ట్రవ్యాప్తంగా చైతన్యాన్ని నింపాలనే ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. తెరాస వాళ్లు ఎన్ని డబ్బులను పంచి ప్రలోభాలు పెట్టినా.. మద్యాన్ని పారించినా.. ప్రజలు మాత్రం ఓటు చైతన్యంతో నాకు విజయాన్ని అందిస్తారు. ఇక్కడ గెలిచి హుజూరాబాద్‌ ప్రజల ఆత్మగౌరవ బావుటాను ఎగురవేస్తా.

బల్మూరి వెంకట్‌:నాకెందుకు ఓటు వెయ్యాలో అర్థమయ్యేలా చెబుతున్నాను. ఇదే నియోజకవర్గంలో ఓటర్లు భాజపాకు ఓటు వేసి ఎంపీగా సంజయ్‌ను గెలిపిస్తే ఆయన చేసిందేమీ లేదు. మళ్లీ ఈటల గెలిచినా చేసేదేమీ ఉండదు. 17 ఏళ్ల నుంచి ప్రజలు తెరాసకు అవకాశమిచ్చినా వారు ఏంచేయట్లేదు. తెరాస గెలిస్తే కేసీఆర్‌ గెలిచినట్టు. భాజపా గెలిస్తే ఈటల గెలిచినట్టు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఒక నిరుద్యోగిని గెలిపించినట్టు. నేను గెలిస్తేనే రెండు ప్రభుత్వాలకు భయం పుడుతుంది. వచ్చే ఎన్నికల్లోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు నెరవేర్చేందుకు ఆస్కారముంటుంది.

నియోజకవర్గంలో ప్రధానంగా మీరు గుర్తించిన సమస్యలేమున్నాయి.?

గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌:అభివృద్ధి పనులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటినీ నెరవేరుస్తాను. చాలా చోట్ల సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు లేవు. ఇటీవల కొన్ని మంజూరయ్యాయి. వాటిని పూర్తిచేసే బాధ్యతను తీసుకుంటాను. గతంలో సరైన పర్యవేక్షణ లేకుండా నియోజకవర్గంలో ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదు. నా దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరిస్తాను.

ఈటల రాజేందర్‌:నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలబెట్టాను. విద్య, వైద్యం విషయంలో అనూహ్య మార్పులు చూపించాను. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధికి అదనంగా నాకు కొన్ని లక్ష్యాలున్నాయి. అభివృద్ధి అంటే సీసీ రోడ్లు, భవనాల నిర్మాణాలు కావు. అవన్నీ అందిస్తూనే.. ఇక్కడి ప్రజల వికాసానికి ఊతమిచ్చేలా, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా అసలైన ప్రగతిని అందిస్తాను. కేంద్రం నుంచి దండిగా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాను.

బల్మూరి వెంకట్‌:నియోజకవర్గంలో చాలా సమస్యలున్నాయి. యువతకు ఉపాధి అవకాశాల్ని అందించడంపై దృష్టి సారిస్తాను. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు సమస్యల్ని వింటూ నమోదు చేసుకుంటున్నా. వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. బరిలో ఉన్న ఇతరులు వీటిపై నోరు విప్పడంలేదు.

ఈసారి మీరు గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు.?

గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌:వైద్యకళాశాల హామీని నెరవేరుస్తాను. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాల్ని ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేయిస్తాను. హుజూరాబాద్‌ నుంచి పెద్దపల్లి వరకు నాలుగులైన్ల దారిని నిర్మించేలా చొరవ చూపిస్తాను. జమ్మికుంట, హుజూరాబాద్‌ పురపాలికల్లో మాస్టర్‌ ప్లాన్‌ అమలయ్యేలా చూస్తాను.నియోజకవర్గాన్ని పారిశ్రామిక కారిడార్‌గా మారుస్తాను.

ఈటల రాజేందర్‌:కేవలం హుజూరాబాద్‌ నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిపరంగా అండగా నిలుస్తాను. అందరి పక్షాన నిలబడుతూ.. వారి గొంతుకనై సరికొత్త భవిష్యత్తు ప్రణాళికతో ముందుకెళ్తాను. ప్రజల ఆకాంక్షలకు వారథిగా నిలుస్తూ 2023లో భాజపాను అధికారంలోకి తెచ్చేలా అందరిలో చైతన్యాన్ని నింపుతాను.

బల్మూరి వెంకట్‌:విద్య, వైద్యం, ఉద్యోగం అందేలా చూస్తాను. ఈ మూడు దరిచేరితే దాదాపుగా అన్ని సమస్యలు పరిష్కారమౌతాయి. ఇక్కడ 80 వేలకుపైగా గడపలుండగా ప్రతి ఇంట్లో విద్యార్థి లేదా నిరుద్యోగి ఉన్నారు. ఇవన్నీ వస్తే ఆ కుటుంబం నిలదొక్కుకుంటుంది. నేను ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకనవుతాను. మార్పు కోసం ఓటెయ్యమని అందరినీ అడుగుతున్నా.

ఇదీ చదవండి:హుజూరాబాద్‌లో వేడెక్కిన రాజకీయం.. గెలుపు కోసం పోటాపోటీ ప్రచారం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details