తెలంగాణ

telangana

ETV Bharat / state

Huzurabad Election 2021: పోలింగ్​ కేంద్రా​ల్లో వసతుల కల్పనకు కసరత్తు..! - కరీంనగర్​ వార్తలు

‘కొండంత రాగం తీసి గోరంత పాటపాడిన’ చందంగా పోలింగ్‌ కేంద్రాల పరిస్థితి మారొద్దనే దిశగా జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక దృష్టిని పెడుతోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల పరిశీలకులు కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఆయా పోలింగ్‌ బూత్‌లన్ని ఆదర్శంగా ఉండాలనే ఆదేశాలివ్వడంతో జిల్లా అధికారులు ఈ దిశగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Huzurabad Election 2021
హుజూరాబాద్ ఉపఎన్నికలు 2021

By

Published : Oct 27, 2021, 8:17 AM IST

ఎన్నికల నేపథ్యంలో అధికారులు పోలింగ్​ కేంద్రాలపై దృష్టి సారించారు. కేంద్ర ఎన్నికల పరిశీలకులు కొవిడ్​ నిబంధనల ప్రకారం పోలింగ్​ బూత్​లన్నీ ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్​ జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్‌తోపాటు పలువురు అధికారులు ఆయా సందర్భాల్లో వీటి తీరుతెన్నుల్ని స్వయంగా పరిశీలించారు. అయినా ఇప్పటికీ ఇంకా చాలా చోట్ల సౌకర్యాలు మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది.

ఇలా చేస్తే...

  • వృద్ధులు వికలాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు నిర్మించి ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో పెద్దమొత్తంలో వీరిని బ్యాలెట్‌ డబ్బా వద్దకు తీసుకెళ్లేందుకు కొనుగోలు చేసిన చక్రాల కుర్చీలను సిద్ధం చేయాల్సిన అవసరముంది.
  • చాలాచోట్ల ఉన్న అక్కడి పరిస్థితుల్ని తాత్కాలికంగానే మరమ్మతు చేస్తున్నారు. వాస్తవానికి రంగు మారిన గోడలకు సున్నం వేయడంతోపాటు అభ్యర్థుల బ్యాలెట్‌ పత్రాన్ని బయట గోడపై ప్రదర్శించేందుకు పెద్ద చార్ట్‌ను ఏర్పాటు చేయాలి.
  • తాగునీటి వసతుల విషయంలో ఇంకా చాలాచోట్ల ఇబ్బందియే కనిపిస్తోంది. దీంతో పోలింగ్‌ రోజు సిబ్బందికి ఓటర్లకు నీళ్లను అందించేందుకు మినరల్‌ వాటర్‌ డబ్బాలతో మంచి నీళ్లు తాగేందుకు తాత్కాలిక ఏర్పాటు చేస్తున్నారు.
  • పోల్‌చీటీలను అప్పటికప్పుడు అందించేలా.. లేదా ఓటరు సమస్యలపై సందేహాలిన తీర్చేలా ప్రత్యేకమైన కౌంటర్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది. తాత్కాలికంగా కుర్చీలు, టేబుళ్లతో ఆ రోజు నెట్టుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
  • ఇంకా చాలాచోట్ల చీకటి గదులు యథావిధిగానే ఉన్నాయి. వెలుతురు సరిగ్గా లేకపోవడం.. విద్యుత్తు దీపాల కాంతితో ఈవీఎంలు మొరాయించిన ఉదంతాలు గత ఎన్నికల్లో కనిపించాయి. మళ్లీ అవి పునరావృతమయ్యే వీలు లేకపోలేదు.
  • ఎక్కువ సంఖ్యలో వృద్ధులు వస్తే వరుసలో నిలబడేందుకు కుర్చీల సౌకర్యాల్ని ఏర్పాటు చేయాలి. పైగా ఎండనుంచి రక్షణ పొందేందుకు టెంట్లను బయట కొంత దూరం పాటు ఏర్పాటు చేస్తే నిలువ నీడ ప్రకారం ఇబ్బంది తొలగనుంది.

ఇల్లందకుంట మండలంలోని చిన్నకోమటిపల్లి పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రమిది. ఈనెల 30వ తేదీకి ఇక్కడ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటు కోసం వచ్చే వారు వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ వరసలో నిలబడేందుకు అవసరమైన వృత్తాలను గీయించారు. విద్యుత్తు, తాగునీటి వసతి సహా ఇతర అవసరమైన సౌలభ్యాల్ని సమకూరుస్తున్నారు. తాగునీరు, విద్యుత్తు ఇతర సౌకర్యాల్ని సమకూర్చుతున్నారు.

హుజూరాబాద్‌ గ్రామీణ మండలం సింగపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్‌ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఇక్కడ ఉన్న రెండు కేంద్రాల్లో ఇంకా లోటుపాట్లున్నాయని వాటిని వీలైనంత తొందరగా సరిచేయాలనేలా ఆదేశాలిచ్చారు. ఓటర్లు లోపలికి వెళ్లే క్రమంలో మెట్ల వద్ద చదును చేయించడంతోపాటు వర్షం పడితే పైకప్పు వల్ల నష్టం కలగకుండా చూడాలనేలా జాగ్రత్తల్ని తెలియజెప్పారు.

ఇదీ.. జమ్మికుంటలోని ఉర్దూ మాద్యమ ప్రాథమిక పాఠశాల కిటికీ దుస్థితి. ఇందులోనే పోలింగ్‌ కేంద్రం ఉండటంతో విరిగిపోయిన కిటికీ తలుపులతో ఇబ్బందికర పరిస్థితియే నెలకొంది. ఓటు వేసేందుకు ఇక్కడి వచ్చే వారికి అసౌకర్యం కలుగకుండా తాత్కాలికంగా చెక్కబోర్డును ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విద్యుత్తు దీపాల్ని అమర్చారు. చాలా రోజులుగా కరోనా వల్ల పాఠశాల మూసి ఉండటంతో ఇప్పుడు ఒక్కసారిగా రూపు మార్చాల్సి వస్తోంది.

కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి

కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్‌ వైద్య సిబ్బందిని ఆదేశించారు. హుజూరాబాద్‌ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంలోని ఆర్టీపీసీఆర్‌ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉప ఎన్నిక నేపథ్యంలో కొవిడ్‌ మొదటి లేదా రెండవడోసు టీకా తీసుకోని అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లు ఆర్టీపీసీఆర్‌ కేంద్రంలో తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని ధ్రువీకరణపత్రాలు పొందాలని తెలిపారు. కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువీకరణ పత్రం ఉన్న పోలింగ్‌ ఏజెంట్లనే అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌ రవీందర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువేరియా, తహసీల్దార్‌ రాంరెడ్డి తదితరులు ఉన్నారు.

ఓటర్లకు అన్ని సదుపాయాలు

ఈ నెల 30న జరగనున్న ఉప ఎన్నికలో ఓటర్లకు అన్నిరకాల సదుపాయాలు కల్పించాలని జిల్లా పాలనాధికారి ఆర్‌.వి.కర్ణన్‌ అన్నారు. హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌ మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. రిటర్నింగ్‌ అధికారి రవీందర్‌రెడ్డికి పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేలా వసతులను కల్పించాలన్నారు. రద్దీని నివారించేందుకు పెద్ద గదుల్లో బూత్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఓటర్లు మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిశ్శబ్ద కాలం...

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అక్టోబరు 27వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి 30వ తేదీ వరకు నిశ్శబ్ద కాలం (సైలెన్స్‌ పీరియడ్‌) ఉంటుందని, పోలింగ్‌కు 72 గంటల ముందు ప్రచారం ముగించాలని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి ఆర్‌వీ కర్ణన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం- 1951 సెక్షన్‌ (126) ప్రకారం ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీలు ప్రజలను సమీకరించరాదని, మీడియా కార్యక్రమాల నిర్వహించొద్దని తెలిపారు. ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించొద్దని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి రెండు సంవత్సరాల శిక్షతో పాటు జరిమానా విధించవచ్చని పేర్కొన్నారు.

కౌంటింగ్‌ కేంద్రం పరిధిలో 144 సెక్షన్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ సందర్భంగా కరీంనగర్‌ ఎస్సార్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో 27న సాయంత్రం నుంచి 2న ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు కరీంనగర్‌ ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈ నిబంధనలు వర్తించవని తెలిపారు.

ఇదీ చూడండి:Road Accident: ఎన్నికల ప్రచారానికి వెళ్లొస్తుండగా ప్రమాదం..

huzurabad election 2021: ఒక్కరోజే గడువు.. ప్రచారం ముమ్మరం చేసిన ప్రధాన పార్టీలు

ELECTION RECORD BREAK:హుజూరాబాద్‌ రికార్డులు.. భారీస్థాయిలో కేంద్ర బలగాలు..!

Huzurabad constituency Voters 2021 : అంతుచిక్కని ఓటరు ఆంతర్యం.. అంతర్మథనంలో అభ్యర్థులు

Huzurabad by poll: 'హుజూరాబాద్​ ఉపఎన్నిక నిర్వహణకు 20 కేంద్ర బలగాలు'

ABOUT THE AUTHOR

...view details