హూజూరాబాద్ ఉపఎన్నికలో "మార్పు కోసం ఓటు వేయండి'' అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ (Huzurabad Congress Candidate venkat ) తెలిపారు. మండలాల వారీగా స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తాను గెలిచేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వెంకట్ ధీమా వ్యక్తం చేశారు. టికెట్ ఆశించి భంగపాటుకు గురైన వారిని కలుపుకుని ముందుకు వెళ్లతానని స్పష్టం చేశారు.ఈ నెల 8న నామినేషన్ వేయనున్నట్లు చెబుతున్న బల్మూరి వెంకట్‌తో (Huzurabad Congress Candidate venkat interview) ఈటీవీ భారత్ ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి...
హుజూరాబాద్ టికెట్ కోసం కాంగ్రెస్ చాలామంది పోటీ పడ్డారు. కానీ మీకే ఆ టికెట్ ఎందుకొచ్చింది?
కాంగ్రెస్ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. అదే విషయాన్ని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలిపారు. దాంట్లో భాగంగా టికెట్ నాకు ఇచ్చారు. తెరాస కూడా విద్యార్థి నాయకుడినే నిలబెడుతుందని సమాచారం. రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికే విద్యార్థి నాయకులకు అవకాశమిచ్చారు.
మిమ్మల్నే.. ఎంపిక చేయడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా?
అన్ని విధాలా ఆలోచించే.. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ రాకముందే.. విద్యార్థి, నిరుద్యోగ సైరన్ అనే కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని బలపర్చాలంటే.. విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని చెప్పడానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.