తెరాస, భాజపాలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్‌లో ప్రచారపర్వం నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకుని గెలుపు తీరం చేరడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరఫున ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఊరూరా తిరుగుతున్నారు. గడప గడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎల్కతుర్తి మండలం పెంచికల పేటలో మహిళలతో సమావేశం నిర్వహించారు. అనంతరం బుజునూరులో ధూంధాంలో పాల్గొన్న హరీశ్ కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ పార్టీ వచ్చినప్పటి నుంచే నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని విమర్శించారు. పెట్రోల్ ధర, గ్యాస్ సిలిండర్ ధర ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు.
పథకాలు బంద్ చేస్తామని బెదిరిస్తున్నారు: ఈటల
తెరాసకు ఓటు వేయకపోతే పథకాలు బంద్ అవుతాయని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మాదన్నపేట, గునపర్తి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. ఆయన సతీమణి ఈటల జమున కమలాపూర్ మండలంలో ప్రచారం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కేసీఆర్ సొమ్ముతో ఇవ్వడం లేదని మనం చెల్లించే పన్నుల నుంచే ఇస్తున్నారని ఈటల తెలిపారు.