తెలంగాణ

telangana

ETV Bharat / state

హుజూరాబాద్‌లో వేడెక్కిన రాజకీయం.. గెలుపు కోసం పోటాపోటీ ప్రచారం - huzurabad by election 2021 campaigns

హుజురాబాద్‌లో ప్రచారం ఊపందుకుంది. అధికార, విపక్షాల గెలుపు కోసం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో పదునైన విమర్శలకు ఎక్కుపెట్టాయి. ఎవరికి వారు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

huzurabad by election 2021 campaigns heat
huzurabad by election 2021 campaigns heat

By

Published : Oct 24, 2021, 4:43 AM IST

హుజురాబాద్‌లో నేతలు ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కి మద్దతుగా మంత్రి హరీశ్‌రావు, గంగుల కమాలకర్‌ ప్రచారం చేశారు. సర్వేలన్నీ గెల్లు గెలుపు ఖాయమని చెబుతున్నాయని హరీశ్‌ రావు పేర్కొన్నారు. విద్యార్థి నేతను గెలిపిస్తే ముఖ్యమంత్రిని ఒప్పించి వైద్యకళాశాల తీసుకువస్తామన్నారు. భాజపా నేతలు నమ్మవద్దని... ఈటల గెలిస్తే ఎవరికీ ప్రయోజనం లేదని హరీశ్‌రావు విమర్శించారు.

గెల్లుదే గెలుపు..

"భాజపా జూటా పార్టీ. కూలగొడతా, అగ్గిపెడతా, బొంద పెడతా అంటూ తిట్లు తిడుతున్నరు. ఇది పేదవాళ్ల కడుపు నిండుతుందా?. ఈటలకు ఓటమి భయం పట్టుకుంది. తన పని అయిపోయిందన్న ఆవేశంలో, ఆక్రోషంతో అలా మాట్లాడుతున్నారు. అన్ని సర్వేల్లో గెల్లు గెలుపు ఖాయమని తేలుతోంది. యువత అంతా గెల్లును, విద్యార్థి నేతను గెలిపిస్తామంటున్నరు. మహిళలు కేసీఆర్ కారుకే తమ ఓటు అంటున్నారు" -హరీశ్​రావు, మంత్రి

కేసీఆర్​ను ఓడించటమే లక్ష్యం..

జమ్మికుంటలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఓట్లు అభ్యర్థించారు. ఇందులో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. ఓటుకి 50 వేలు ఇచ్చినా తీసుకుని కమలం గుర్తుకు ఓటు వేయాలని ఈటల కోరారు. హుజురాబాద్‌లో అభివృద్ధి చేయలేదని తెరాస మంత్రులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న ఈటల...... ప్రచారానికి ఎవరు వేసిన రోడ్లపై వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఆత్మగౌరవానికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

"నా పోరాటమే బానిసత్వాన్ని బద్దలు కొట్టేందుకు. డ్రామా మాస్టర్‌ హరీశ్​రావు, కేసీఆర్.. కన్నా నేను సీరియస్ పోలిటీషియన్‌ను. మీరు చెప్పేవి అన్నీ దొంగ సర్వే రిపోర్టులు. మీ భయానికి అధికారులు రాసి ఇస్తున్నారు. ఓటుకి 50 వేలు ఇచ్చినా.. తీసుకొని ఓటు మాత్రం నాకు వేయండి. అధికార పార్టీ బెదిరించినా కూడా భయపడకుండా ఆడబిడ్డలు బయటికి వచ్చి హారతులు పడుతున్నారు. ఈ సారి కులం, మతం, పార్టీతో సంబంధం లేదు. ఒకటే సంబంధం.. కేసీఆర్​ను ఓడగొట్టడమే లక్ష్యం."-ఈటల రాజేందర్​, భాజపా అభ్యర్థి

ఎప్పుడొచ్చామని కాదు...

హుజురాబాద్‌ ఉపఎన్నిక ప్రజలపై బలవంతంగా రుద్దారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కి మద్దతుగా వీణవంక, జమ్మికుంట మండలాల్లో రోడ్‌ షో నిర్వహించారు. అభ్యర్థి ఆలస్యంగా ఖరారు అయినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని కోరారు.

"వెంకట్‌ స్థానికుడు కాదని ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్‌ది సిరిసిల్ల నా..? గజ దొంగ కేసీఆర్​ది గజ్వేల్ కాదు.. మోసగాడు హరీశ్​ రావుది సిద్దిపేట కాదు. మరి ఇప్పుడు వెంకట్​ది జమ్మికుంట కాదని ఎలా మాట్లాడుతున్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు ఒక్కటై.. గంటలో మీకు దళితబంధు పైసలు ఇవ్వచ్చు. మరి ఎందుకు ఇవ్వటం లేదో మీరే ఒకసారి ఆలోచించుకోవాలి. మీ అభ్యర్థిని ఆలస్యంగా పంపారని అంటున్నారు. ఎప్పుడు వచ్చామని కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అని చూడాలే." -రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details