హుజూరాబాద్ ఉపఎన్నికల్లో(huzurabad by election) ఎలాంటి ఫలితం రాబోతుందన్న అంశాన్ని రాష్ట్ర ప్రజలంతా ఆసక్తితో గమనిస్తున్నారని భాజపా జాతీయ నాయకులు మురళీధర్‌రావు అన్నారు. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఆయన బోర్నపల్లిలో ప్రచారం నిర్వహించారు. తెరాస మనుగడ, కుటుంబ పాలన కొనసాగాలంటే ప్రశ్నించే వారు ఉండొద్దని ఈటలను గెలవకుండా కేసీఆర్ అడ్డగోలు ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక్క హుజూరాబాద్‌లోనే ఈటల రాజేందర్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.
హుజూరాబాద్ ప్రజల మీద నమ్మకంతోనే కేసీఆర్ మీద ఈటల రాజేందర్(etela rajender) యుద్ధం ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఈటల ఎండ వాన లేకుండా, కుటుంబాన్ని వదిలిపెట్టి పని చేస్తే... కేసిఆర్ ఇప్పుడు ఈటల రాజేందర్‌ను బయటికి పంపించారని మురళీధర్ రావు పేర్కొన్నారు. ఆయనను ఓడించాలని కేసిఆర్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడటం కోసం, కుటుంబ పాలనను అంతం చేయడానికి ఈటల రాజేందర్‌ను గెలిపించాలని మురళీధర్‌రావు కోరారు.
తెలంగాణ ఉద్యమం కోసం ఎండ వాన లేకుండా, కుటుంబాన్ని వదిలిపెట్టి పని చేస్తే పార్టీ నుంచి బయటకు పంపించారు. కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలంటే ఈటల రాజేందర్‌కు ఓటేసి గెలిపించాలి.-మురళీధర్ రావు, భాజపా జాతీయ నాయకులు