అధికార పార్టీ నాయకులు రోజుకొక లేఖను సృష్టించి తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్(huzurabad bjp candidate etela rajender) విమర్శించారు. ఐదునెలలుగా అధికార పార్టీ కుట్రలపై పోరాడుతున్నానని తెలిపారు. పదవి పోతే ప్రజలు దూరమవుతారు కానీ.. నాకు మాత్రం దగ్గరయ్యారని పేర్కొన్నారు. నా రాజీనామా వల్లే హజూరాబాద్లోనే మొట్టమొదటిసారి దళితబంధు అమలవుతోందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆడబిడ్డలకు వడ్డీలేని రుణాలు అందుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలోని కనపర్తి, వల్భాపూర్, నర్సింగాపూర్, కొండపాక గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నాతో ఉన్న ఊసర వెల్లులంతా ఒక దిక్కుపోతే.. ఊరంతా నా వైపే ఉన్నారని ఈటల సంతోషం వ్యక్తం చేశారు. అధికార పార్టీ చేస్తున్న కుట్రలకు మరొకరైతే చచ్చిపోయేవారన్నారు. ప్రతిరోజు నాపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నేను ఆనాడే చెప్పాను.. ఇప్పుడు చెబుతున్నా.. సీఎం కేసీఆర్, హరీశ్ రావు నాపై పోటీకి దిగాలని సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. తలకిందికి.. కాళ్లు పైకి పెట్టినా హుజూరాబాద్‌తో తెరాస గెలవదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. నవంబర్ రెండో తేదీన హుజూరాబాద్‌లో ఎగురబోయేది భాజపా జెండానే అని ఈటల ధీమా వ్యక్తం చేశారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను ఎవరినీ అడిగినా కూడా ఈటల రాజేందర్‌దే విజయం అంటున్నారని తెలిపారు.
ఇయాల రోజుకోక లేఖ నామీద పుట్టిస్తున్నరు. అబద్ధాల కోరులు వాళ్లు. దళితబంధు వద్దని నేను ఉత్తరం రాశానని అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు. అది తప్పని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి 750 కోట్లు ఖర్చు పెట్టిన్రు. మరో లేఖ పుట్టించిండ్రు. నేను కేసీఆర్ వద్ద మోకరిల్లుతానంటా? అరే నా జాగాలో ఎవడన్నా ఉంటే ఖతమైపోవు ఇప్పటికే. ఈ నెల 30న ఓట్లు వేయించుకునేది నేనే. వచ్చేనెల 2న గెలిచేది నేనే. ఇప్పుడు మళ్లీ సవాల్ విసురుతున్నా. తలకిందికి పెట్టి కాళ్లు పైకి పెట్టినా హుజూరాబాద్‌లో మీ పార్టీ గెలవదు గాక గెలవదు. నీవు కులాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నవ్. గొర్లు, బర్లు ఇస్తున్నవ్. మొట్టమొదటి సారి దళితబంధు ఇస్తున్నవ్. చివరికి నాలుగేళ్ల క్రితం ఆడబిడ్డలకు రావాల్సిన చెక్కులు ఇవాళ వస్తున్నాయ్. అవన్నీ ఈటల రాజేందర్ వల్లే వస్తున్నయ్. ఇవీ కేవలం హుజూరాబాద్‌లోనే వచ్చేది మరెక్కడా రావు. పదవులు పోతే ఎవరు రారు. పదవి పోయిందని ప్రజలే నాకు దగ్గర అయిండ్రు. సర్పంచ్, ఎంపీటీసీలను కొనగానే ఓట్లు పడుతాయనుకున్నరు. ప్రజలందరూ ఒకటే చెబుతుండ్రు. ఈటల రాజేందరన్న నీ విజయం ఖాయం.