హుజూరాబాద్ నియోజకవర్గం ఉపఎన్నిక(Huzurabad by election) రోజురోజుకు వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలైన తెరాస-భాజపాల మధ్య పోరు హోరుగా సాగుతోంది. ఇరు పార్టీలు ప్రచారాలతో నియోజకవర్గంలో వేడి పుట్టిస్తున్నారు. వాక్బాణాలతో ఒకరిపై మరొకరు దాడి చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటల తెరాస లోగుట్టును బయటపెడుతూ.. ప్రజల సానుభూతి కోసం ప్రయత్నిస్తుండగా.. మరోవైపు మంత్రి హరీశ్ రావు.. ఈటలపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. నియోజకవర్గంలో పిసరంత అభివృద్ధి కూడా జరగలేదని ఒకరంటుంటే.. అసలు తన నియోజకవర్గానికి నిధులే సరిగ్గా ఇవ్వలేదని మరొకరు మాటలు విసురుతున్నారు. ఇన్నాళ్లూ.. సాఫీగా సాగిన హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం.. మంత్రి హరీశ్ రావు రంగ ప్రవేశంతో.. రంజుగా మారింది.
ఇన్నాళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతల్ని తెరవెనుక ఉండి నడిపించిన మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు నేరుగా నియోజకవర్గంలో అడుగుపెట్టారు. సిద్దిపేట కేంద్రంగా నడిపించిన మంత్రాంగానికి తోడుగా.. క్షేత్రస్థాయిలో కాలుమోపి అసలైన కదనరంగానికి సిద్ధమయ్యారు. ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మంత్రి తనదైన మార్కుని ఇక్కడ వేసే పనిలో వేగాన్ని పెంచుతున్నారు. బుధవారం నియోజకవర్గంలో నిర్వహించిన రెండు సభలతోపాటు గురువారం మహిళలతో నిర్వహించిన సభలో తనదైన మాటలతో ఆకట్టుకుంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విడమరిచి చెబుతూనే తనదైన తరహాలో ప్రజలకు పథకాల్ని చక్కగా వివరిస్తున్నారు. ఇక గ్రామాల వారీగా ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు ఉమ్మడి కరీంనగర్ నుంచి తరలి వచ్చిన పార్టీ నాయకులకు బాధ్యతల్ని అప్పగించి తెరాస అభ్యర్థి గెలుపు అవకాశాలకు కృషి చేస్తున్నారు. ప్రతి వంద మందికి ఒకరిని బాధ్యుడిగా నియమించడంతోపాటు ఆయా గ్రామాలు, పట్టణాల వారీగా వాట్సాప్ సమూహాలను ఏర్పాటు చేసి తనకు ఎన్నికల పర్యవేక్షణలో ఉన్న గతానుభవాన్ని చేతల్లో చూపిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్‌తోపాటు కొప్పుల ఈశ్వర్‌లను సమన్వయ పర్చుకుంటూనే ప్రత్యేర్థిపై పై చేయి సాధించేలా వ్యూహాత్మక అడుగుల్ని వేస్తున్నారు. ఈనెల 16న నిర్వహించే ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు ఇక్కడే మకాం వేశారు.