కరీంనగర్ జిల్లా చింతకుంట జడ్పీ ఉన్నత పాఠశాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ పాఠశాలల్లో పచ్చదనం(GREENERY) ఉట్టిపడుతుంది. ఏపుగా పెరిగిన చెట్లతో ఆహ్లాదకరమైన వాతారవణం ఉంటుంది. పాఠశాల ప్రాంగణంలోకి అడుగు పెట్టడంతోనే చల్లగాలితో అక్కడి చెట్లు పలకరిస్తాయి. ఎత్తైన చెట్లు కాకుండా పూలమొక్కలు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. ఆ వనంలోని చెట్లు, కొమ్మలు మనతో ముచ్చటిస్తాయి. అందులోని చెట్ల కొమ్మలు మనకు ఊసులు చెప్పేందుకు యత్నిస్తాయి.
వినూత్న కార్యక్రమం
ప్రస్తుత పరిస్థితిలో వాతావరణ కాలుష్యం తగ్గించడంలో కీలకపాత్ర పోషించే చెట్ల ప్రాధాన్యతను చిన్ననాటి నుంచి విద్యార్ధులకు బోధించాలనే ఉద్దేశ్యంతో ప్రతి చెట్టుకు సందేశాల బోర్డులు వేలాడదీశారు అక్కడి ఉపాధ్యాయులు. పాఠశాలకు వచ్చే విద్యార్దులు చెట్ల ప్రాధాన్యతను తెలుసుకోవడమే కాకుండా వాటి గురించి తల్లిదండ్రులకు తెలియజెప్పే విధంగా వినూత్న ప్రయత్నం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.భూంరెడ్డి... పాఠశాలలోని 15 చెట్లకు 18 రకాల సందేశాల బోర్డులు వేలాడదీశారు. వినూత్నంగా చేపట్టిన ఈ కార్యక్రమం అందరినీ ఆకర్షిస్తోంది.
పలువురి ప్రశంసలు
హరితహారం రాష్ట్ర ఇంఛార్జి ప్రియాంక వర్గీస్ ఇటీవల పాఠశాలను సందర్శించి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. ఎంపీ సంతోష్ కుమార్ ట్విటర్ వేదికగా ప్రధానోపాధ్యాయుడిని ప్రశంసించారు. పాఠశాలలో చెట్లను పెంచేందుకు గ్రామ పంచాయతీ పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. విద్యార్థులు చెట్లను దత్తత తీసుకొని మొక్కలను ఏపుగా పెంచేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
చెట్టు కొమ్మలు గాలికి ఊగినప్పుడల్లా నాతో ఏదో మాట్లాడినట్లు అనిపించేది. అదే ఆలోచనతో పాఠశాలలోని చెట్లకు సందేశాలను వేలాడదీశాం. ఇలా చేయడం వల్ల చెట్లతో మాట్లాడుతున్న అనుభూతిని విద్యార్థులు పొందుతారు. గ్రామ పంచాయతీ తమ పూర్తి సహకారం అందిస్తున్నారు.