కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డితోపాటు ముగ్గురికి కోర్టు ధిక్కరణ నేరం కింద జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఆరు నెలల జైలు శిక్ష, 12వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తీగలగుట్టపల్లిలోని పుష్పాంజలి రిసార్ట్స్‌లో పేకాట అడుతున్నారని గతంలో పోలీసులు దాడులు చేశారు. ఈ కేసులో రిసార్ట్స్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించగా...12 కార్డులతో రమ్మీ ఆడటం నేరం కాదని.. దానిపై బెట్టింగ్ చేయడం మాత్రమే నేరమని న్యాయస్థానం స్పష్టం చేసింది. రిసార్ట్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించిన హైకోర్టు.. వాటిని పరిశీలించి బెట్టింగ్ జరిగినట్లు రుజువైతేనే సోదాలు చేయాలని పోలీసులను 2015లో ఆదేశించింది. అనుమానాలతో రిసార్ట్స్‌లో ప్రవేశించి వేధించొద్దని స్పష్టం చేసింది.
కరీంనగర్ సీపీ సహా ముగ్గురు పోలీస్ అధికారులకు జైలుశిక్ష - కరీంనగర్ సీపీ సహా ముగ్గురికి జైలు శిక్ష, జరిమానా
కోర్టు ధిక్కరణ కేసులో కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి సహా ముగ్గురికి... హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేసి తన రిసార్టులోకి వెళ్లి వేధిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే జగపతిరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో హైకోర్టు తీర్పు వెల్లడించింది.

న్యాయస్థానం ఆదేశాలను లెక్కచేయకుండా పోలీసులు అక్రమంగా ప్రవేశించి వేధిస్తున్నారని రిసార్టు యజమాని, మాజీ ఎమ్మెల్యే జగపతిరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన కోర్టు తీర్పు వెల్లడించింది. సీపీ కమలాసన్ రెడ్డితోపాటు ఆ సమయంలో కరీంనగర్లో పనిచేసిన ఏసీపీ తిరుపతి, కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో శశిధర్ రెడ్డికి జైలు శిక్ష, జరిమానా విధించింది. అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా తీర్పును నాలుగు వారాలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: పురపాలక ఎన్నికలపై విచారణ రేపటికి వాయిదా...