Heavy Rains In North Telangna Districts : భారీ వర్షాలకు ఉత్తర తెలంగాణ జిల్లాలు వణికిపోతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. కుండపోతగా వర్షానికి వాగులు, చెరువుల్లో ప్రవాహ ఉద్ధృతికి చాలా ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మోకాల్లోతు వరదలో వెళ్లలేక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి, ఇంధల్వాయి, డిచ్‌పల్లి, మోపాల్, ధర్పల్లి, సిరికొండ ,నిజామాబాద్ గ్రామీణ మండలాల్లో వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రామడుగు ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. సిరికొండకు నాలుగువైపుల నుంచి రాకపోకలు ఆగిపోయాయి. జక్రాన్‌పల్లి పెద్దచెరువు కట్ట ముప్పు పొంచి ఉన్న తరుణంలో గ్రామస్తులు చెరువు అలుగు తొలగించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ నాల ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి, ఎడపల్లి మండలంలోని అలీ సాగర్ జలాశయం రెండుగేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.
భారీ వర్షాలతో పెద్దపల్లి రాజీవ్ రహదారిపైకి భారీగా వరద చేరింది. ముందు జాగ్రత్తగా ఓ వైపు నుంచే వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వరద గుప్పిట్లో చిక్కుకుంది. జవహర్ నగర్‌లో ఇల్లుకూలి.. ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మేడిపల్లి మండలం రాజలింగంపేటకి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. గ్రామ సర్పంచ్ జేసీబీ సాయంతో వాగు దాటించి ఆసుపత్రికి తరలించేలా చొరవ తీసుకున్నారు. గోపాల్‌పూర్ ఇసుక క్వారీలో మానేరు వాగు ప్రవాహంలో 12 మంది చిక్కుకుపోగా అధికారులు వారిని రక్షించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వర్షం ధాటికి ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.
ముంపునకు గురైన ఉమ్మడి కరీంనగర్ : ఎగువ నుంచి వస్తున్న వరదతో సిరిసిల్లలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. వరద కాలువలు, నాలాలు ఆక్రమించడం వల్లే ముంపు బారినపడ్డామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పందివాగు, రామడుగులోని మోతె వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి కరీంనగర్ జలమయంగా మారింది. ఎన్టీఆర్ కూడలి, రామగుండం బైపాస్ రోడ్డు, ఆర్టీసీ వర్క్‌షాప్ వద్ద భారీగా వరద నీరు చేరింది. రేకుర్తిలోని మైనార్టీ గురుకులాన్ని వరద చుట్టుముట్టింది.