కరీంనగర్‌లో సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అతలాకుతలమవుతోంది. మురుగు కాలువల నీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో. వర్షపు నీరు రహదారులపై ప్రవహిస్తోంది. ఆర్టీసీ వర్క్‌షాప్ నుంచి రేకుర్తి వరకు మధ్య ఉన్న రహదారి పూర్తిగా నీటితో నిండిపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాలకు జలమయమైన రోడ్లు,కాలనీలు నీటిలో మునిగిన కార్లు
సూర్యనగర్ కాలనీ పూర్తిగా నీటిమయమైంది. ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. కార్లు నీటిలో తేలియాడుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు వేరే మార్గం నుంచి మళ్లిస్తున్నారు. వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలు నిర్మించకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు
పరీక్షలు వాయిదా
కరీంనగర్-జగిత్యాల వెళ్లే రహదారిలో వీ పార్క్ హోటల్ వద్ద రహదారి నీట మునిగింది. విద్యానగర్, జ్యోతినగర్, సూర్యనగర్ నుంచి వస్తున్న వర్షపు నీరంతా రోడ్డుపైకి చేరడంతో కరీంనగర్-జగిత్యాల రహదారి చెరువును తలపిస్తోంది. రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో శాతవాహన వర్సిటీ పరిధిలో ఇవాళ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. ఇవాళ కరీంనగర్ జిల్లాలో పాఠశాలలకు కలెక్టర్ కర్ణన్ సెలవు ప్రకటించారు
గంగుల పరిశీలన
కరీంనగర్‌లో నీటమునిగిన ప్రాంతాలను మేయర్ సునీల్‌రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ప్రభుత్వ పరంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తాయని నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కమలాకర్ ప్రజలకు సూచించారు.ప్రకృతి విపత్తులు ఎవరూ ఆపలేరని దీనిని రాజకీయ కోణంలో చూడవద్దన్న ఆయన ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరీంనగర్ నుంచి జగిత్యాల ప్రయాణించడానికి వేరే మార్గాన్ని ఎంచుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.
జిల్లాలో ఎడతెరిపిలేని వానతో హుజూరాబాద్, జమ్మికుటం, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ మండలాలు తడిసి ముద్దయ్యాయి. వాగులు, చెరువులు నిండిపోయి అలుగు పడుతున్నాయి. జమ్మికుంట మున్సిపాలిటీలో హౌసింగ్‌బోర్డు కాలనీ, శిశుమందిర్ కాలనీ, అంబేడ్కర్ నగర్ కాలనీలో నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు చేరి స్థానికులు అవస్థలు పడుతున్నారు.
ఇదీ చదవండి:Cm Kcr review on rains : 'వరద నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండండి'