Heavy Rains in Karimnagar District : మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్‌లో చాలాచోట్ల వరద పోటెత్తింది. రహదారులు నీట మునిగాయి. వాననీరు లోతట్టు కాలనీల్లో ఇళ్లను ముంచెత్తింది. వావిలాలపల్లి, మంచిర్యాల చౌరస్తా, ఇందిరాచౌక్, అశోక్‌నగర్, హుస్సేనిపుర, శ్రీనగర్‌కాలనీ, రాంనగర్, విద్యానగర్, ఆమేర్‌నగర్, పాతబజారు, విద్యానగర్, కోతిరాంపూర్, కట్టరాంపూర్‌తోపాటు విలీన కాలనీల్లోని విలీన కాలనీల్లోని వీధుల్లో మురుగునీటి కాల్వలు పొంగిపొర్లాయి. మోకాల్లోతున చేరిన వరద నీటిలో ఆయా ప్రాంతాల ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు.
ముకరంపుర, మంకమ్మతోట రెండో ఠాణా వెనక భాగంలో భారీగా వరద చేరింది. హౌసింగ్‌బోర్డు కాలనీలో పలు ఇళ్లను వరదముంచెత్తింది. శర్మనగర్‌లో ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతోందని స్థానికులు వాపోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా... వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆరోపిస్తున్నారు. అంతర్గత మురుగు కాల్వలను ప్రధాన డ్రైన్‌కు కలపకపోవడం వల్లే అవస్థలు పడుతున్నామని తెలిపారు.
"వర్షం పడితే మురుగు నీరంతా ఇంట్లోకి వస్తోంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ పరిస్థితి తప్పదు. కాలనీలోచేరిన వరద వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. బయటికి వెళ్లాలంటే భయపడాల్సి పరిస్థితి నెలకొంది. మోకాళ్ల నీరు నిలిచిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నాం. అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా ఫలితం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం." - స్థానికులు
Heavy Rains in Karimnagar :స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని త్వరలోనే నిధులు మంజూరైతే పనులు పూర్తిచేస్తామని అంటున్నారు. వర్షాలతో ఎదురయ్యే సమస్యల తక్షణ పరిష్కారానికి నగరపాలక సంస్థ సంసిద్ధంగా ఉందని మేయర్ సునీల్‌రావు స్పష్టం చేశారు.