తెగిన వంతెనలు.. కొట్టుకుపోయినా రోడ్లు.. చర్యలు చేపట్టిన అధికారులు Karimnagar Heavy Loss Due To Rains : భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. కరీంనగర్ జిల్లా రామడుగులోని మోతె వాగు వంతెన వరదలకు కొట్టుకుపోగా.. వందలాది వాహనాలు మరో దారిలేక నిలిచిపోయాయి. దీంతో రామడుగు మండలంలో పది గ్రామాలు, పెగడపల్లి మండలానికి రవాణా స్తంభించింది. మోతె శివారులోని లోతట్టు వంతెన కొట్టుకుపోవడంతో మండలంలోని మరో పది గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.
Heavy Loss in Karimnagar Due to Rains : గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లె వంతెన వరదలకు కొట్టుకుపోవడంతో 30 గ్రామాలకు రవాణా స్తంభించింది. రామడుగు, గంగాధర, పెగడపల్లి మండలాల నుంచి పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, ఆసుపత్రులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టక పోవడంతో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో దెబ్బతిన్న రోడ్లను ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న వాగులు, వంకల సమీపంలోని రోడ్ల పరిస్థితి అంచనాలు సిద్ధం చేస్తున్నారు. మండలాల వారీగా సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. ప్రాథమికంగా అంచనాల్ని రూపొందించి ఉన్నతాధికారులకు నివేదికలు అందించారు. ఒకట్రెండు రోజుల్లో సమగ్ర నివేదికలివ్వనున్నారు.
రోడ్లు వంతెనలు కూలడంతో కోట్లల్లో నష్టం:జగిత్యాల జిల్లాలో 40 రోడ్లకు పలుచోట్ల నష్టం జరిగినట్లు గుర్తించారు. విద్యుత్త్‌శాఖకు కోటి రూపాయల నష్టం వాటిల్లింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో 33 దారుల్లో గుంతలు పడగా.. 125 రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 27, సిరిసిల్ల జిల్లాలో 41 రహదారులు రూపు కోల్పోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. 141 రహదారులకు ముప్పు వాటిల్లగా.. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.22 కోట్లు ఖర్చవుతుందని అంచనా. పంచాయతీరాజ్ రోడ్లు కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లిలో 150కి పైగా దెబ్బతిన్నట్లు గుర్తించి.. వాటి బాగుకి రూ.40 కోట్లు అవసరమని అంచనా వేశారు. వంతెనలు దెబ్బతిన్న చోట్ల.. తక్షణం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
"ఈ వంతెన కూలిపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. రాకపోకలకు కష్టంగా ఉంది. ఎలాంటి అవసరమైనా ఈ వంతెన దాటాలి. అధికారులు ఇప్పటికైనా గుర్తించి చర్యలు చేపట్టాలని కోరుతున్నాం." - స్థానికులు
పెద్దపల్లి జిల్లాలో 2,900 మంది రైతులకు చెందిన వరి 4,970 ఎకరాలు, 406 రైతులకు చెందిన పత్తి పంట 847 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు గుర్తించారు. జగిత్యాల జిల్లాలో 11,559 ఎకరాల్లో అన్నిరకాల పంటలకు ముప్పువాటిల్లింది. కరీంనగర్ జిల్లాలో నీటమునిగిన పత్తి, వరి లెక్కల వివరాల నమోదులో అధికారులు నిమగ్నమయ్యారు. 160 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు గుర్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివరాలు సేకరిస్తున్నారు. నాలుగు జిల్లాల పరిధిలో లోతట్టు వంతెనల పైనుంచి వరద ప్రవాహం తగ్గడంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. తప్పనిసరై ప్రయాణం చేయాల్సిన వారు చుట్టూ ఉన్న ఊళ్లను తిరుగుకుంటూ.. దూరాభారమైనా ముందుకెళ్తున్నారు
ఇవీ చదవండి: