రాష్ట్రప్రభుత్వం అసంక్రమిత వ్యాధుల బారిన పడిన వారిని గుర్తించి వారికి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ సర్వేలో వీరిసంఖ్య పెరుగుతోంది. 30సంవత్సరాలు పైబడిన వారిని గుర్తించి ఇంటింటా గతేడాది నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 80శాతానికి సర్వే పూర్తి కాగా మరో 20శాతం కావాల్సి ఉంది. కరోనా టీకా కార్యక్రమం ముమ్మరం చేయడంతో సర్వే కొంతమేర జాప్యమవుతోంది. సర్వేలో తేలిన ప్రాథమిక వివరాల ప్రకారం రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రాథమిక, జిల్లాస్థాయిలో వైద్యం
లక్షణాలు ఉండి వ్యాధులతో బాధపడుతున్న వారిని అంచనా వేస్తున్న ఆశా కార్యకర్తలు వీరిని సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా కేంద్ర ఆసుపత్రికి పంపించి పూర్తిస్థాయిలో నిర్ధారించి తగిన వైద్యం అందేలా చూస్తారు. అవసరమైతే సంబంధిత వ్యాధుల విభాగాలకు పంపి వైద్యం అందిస్తారు.
50 శాతం కేసుల పెరుగుదల
గతంతో పోల్చితే రక్తపోటు, మధుమేహంతో బాధపడే వారి సంఖ్య 50శాతం పెరిగినట్లు ప్రాథమిక సర్వేలో తేలింది. తగిన మందులు పంపిణీ చేస్తుండగా తీవ్రత ఉన్న వారికి గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు సైతం చేయించి ఆరోగ్య ముప్పు లేకుండా చూస్తున్నారు.
మధుమేహం.. కారణాలు
- కార్బొహైడ్రేట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం
- శారీరక శ్రమ తగ్గడం
- జన్యుపరమైన కారణాలు
- గర్భవతిగా ఉన్నప్పుడు మధుమేహం ఉంటే ఆ తర్వాత వచ్చే అవకాశం ఎక్కువ.
- ఊబకాయం, మహిళలకు నెలసరి సరిగా లేకపోవడం, జంక్‌ఫుడ్ ఎక్కువగా తినడం, రక్తపోటు ఉన్న వారిలో కూడా మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ.
కారణాలివే...
మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ధూమపానం, సమయానికి తినకపోవడం, ఊబకాయం, శారీరక శ్రమ తగ్గడం, జన్యుపరమైన సమస్య, రక్తపోటు, మధుమేహం సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్న వారు గుండె జబ్బు బారిన పడేఅవకాశం అధికం.
సర్వేలో వ్యాధిగ్రస్తుల గుర్తింపు
అసంక్రమిత వ్యాధుల బారిన పడ్డ వారిని గుర్తించి తగిన వైద్యం ప్రభుత్వపరంగా అందుబాటులో తీసుకురావాలని ప్రభుత్వం 2019 నుంచి చర్యలు ప్రారంభించింది. జిల్లా జనాభాలో 30ఏళ్లు పైబడిన వారిని మాత్రమే గుర్తించి ఆధార్‌కార్డు వివరాలతో ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ఏటా నిర్వహించే సర్వే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొనసాగుతోంది. దీనిని మూడునెలల్లో పూర్తిచేసి కొత్తగా వ్యాధుల బారిన పడిన వారికి చికిత్స అందించాలి. గతంలో గుర్తించిన మధుమేహం, రక్తపోటుతో బాధ పడేవారికి మందులు పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యాధులతో సతమతమయ్యే వారి సంఖ్య ప్రాథమికంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వీటితో పాటు గుండెజబ్బు, క్యాన్సర్, మానసిక సమస్యలు, ఇతర అసంక్రమిత వ్యాధుల బారిన పడిన వారిని గుర్తిస్తున్నారు.
సర్వేలో గుర్తించిన వారు
రక్తపోటు లక్షణాలు: 72,237
జిల్లా జనాభా: 9,46,939