తెలంగాణ

telangana

ETV Bharat / state

9 గంటలకే వైద్య విధాన పరిషత్​ కమిషనర్ తనిఖీ.. సిబ్బంది ఉరుకులు పరుగులు..​ - కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి తాజా వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్నా వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ సూచించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Karimnagar District Government Hospital
కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి

By

Published : Apr 27, 2022, 6:52 PM IST

కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సమయపాలన పాటించని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటలకే ఆయన ఆసుపత్రికి చేరుకున్నారు. కమిషనర్ వచ్చిన 40 నిమిషాల తర్వాత సిబ్బంది ఇంటి నుంచి గబగబా ఆసుపత్రికి చేరుకున్నారు. ఇదే సంఘటన మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలతో పాటు బదిలీ తప్పదని హెచ్చరించారు.

ఆసుపత్రి ఏవో ఇష్టానుసారంగా సమయపాలన పాటించకుండా వస్తున్నారని తెలపడంతో కమిషనర్ అజయ్ కుమార్ మందలించారు. సీసీ కెమెరాలతో పాటు బయోమెట్రిక్‌ను ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ రత్నమాలకు సూచించారు. ఆలస్యంగా వచ్చిన సిబ్బంది ఆయన ముందే రిజిస్టర్‌లో సంతకాలు చేస్తూ హడావుడి చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 12 మంది వైద్యులకు మెమోలు జారీ చేశారు.

ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ సమయంలో ప్రైవేట్ క్లినిక్ లో పనిచేస్తూ దొరికితే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి లక్షల్లో వేతనాలు తీసుకుంటూ.. పేద, మధ్య తరగతి రోగులకు ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఆసుపత్రిలో అన్ని వార్డులను పరిశీలించారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఉన్న మూత్రశాలలు శుభ్రం చేయకపోవడంతో సిబ్బందిని అజయ్ కుమార్ మందలించారు.

"విధినిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. సిబ్బంది సకాలంలో హాజరుకావాలి. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 12 మంది వైద్యులకు మెమోలు జారీ చేశాం. మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నాము. మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు తప్పవు. వైద్యులు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉండాలి. సీసీ కెమెరాలతో పాటు వెంటనే బయోమెట్రిక్‌ను ఏర్పాటు చేయాలి. ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. వైద్యులు ,సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలి."

- అజయ్ కుమార్ వైద్య విధాన పరిషత్ కమిషనర్

ఇదీ చదవండి:Nama in pleanary: 'మోటర్ల వద్ద మీటర్లు పెడితే ఊరుకునేది లేదు'

'మాధవపురం'గా మారిన మహ్మద్​పుర్​.. ఆప్​, భాజపా మాటల యుద్ధం

ABOUT THE AUTHOR

...view details