karimnagar smart city: మహా నగరాల తరహాలో సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేశారు. పనులు ప్రారంభమై మూడేళ్లు గడుస్తోన్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. తొలి ప్రాధాన్యంగా రహదారులు, డ్రైనేజీలు, సైకిల్, వాకింగ్‌ట్రాక్, మొక్కల పెంపకం, పార్కులు, కూడళ్ల సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. వీటిలో ఒకటిరెండు పూర్తి కాగా మిగతావి చిన్నచిన్న కారణాలతో నిలిచిపోయాయి.
ఆకర్షణీయ నగరం పనులు చేపట్టేందుకు ఏజెన్సీలకు పలుమార్లు గడువు విధించినా.. ప్రతి ఆరు నెలలకొకసారి పొడిగించేందుకే అధికారులు మొగ్గు చూపుతున్నారు. నగరపాలక ఇంజినీర్లు పనులు పూర్తి చేసేలా పర్యవేక్షించడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. నగరంలో 34కిమీ పొడువునా 84 పైగా రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇందులో ఏ ఒక్కటీ కూడా పూర్తికాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
సుమారు 30 అడుగుల నుంచి 60అడుగుల వరకు రహదారులు విస్తరించాలని పనులు ప్రారంభించారు. ఆ పనులు పూర్తికాక పోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంబేడ్కర్‌స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులకు 22కోట్లు కేటాయించగా 80శాతం పనులు జరిగాయి. టవర్ సర్కిల్ అభివృద్దికి17కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు 36శాతమే పూర్తయింది.