ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చేనేత సంఘాలు, కార్మికులను ఆదుకొనేందుకు సర్కారు అనేక పథకాలు అమలుచేస్తున్నా నిధుల విడుదలలో జాప్యం వెంటాడుతూనే ఉంది. ఏళ్ల తరబడి ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల కరీంనగర్ జిల్లాలో చేనేత కార్మికులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు మార్కెటింగ్ సౌకర్యం లేక సంఘాల్లో లక్షల విలువైన వస్త్రాలు గోదాముల్లో నిల్వ ఉన్నాయి. జిల్లాలోని 20 చేనేత సంఘాల్లో 1,436 మంది కార్మికులు, అనుబంధ రంగాల్లో మరో 589 మంది పనిచేస్తున్నారు. అన్ని సంఘాల్లో కలిపి ఏటా సుమారు 10 కోట్లకు పైగా వస్త్ర ఉత్పత్తులు జరుగుతుండగా... 60 శాతం టెస్కో కొనుగోలు చేస్తోంది. మిగిలిన 40 శాతం వస్త్రాలను సంఘాలే సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాల్సి వస్తోంది. చేనేత వస్త్రాలకు అంతగా ఆదరణ లేకపోవడంతో లక్షల విలువైన ఉత్పత్తులు సంఘాల్లో పేరుకుపోయాయి.
అమలుకు నోచుకోని పథకాలు
దీనికితోడు ప్రభుత్వం బకాయిలు చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. 20 శాతం యార్న్ సబ్సిడీ పథకాన్ని నాలుగేళ్ల కిందట ప్రభుత్వం రద్దు చేసింది. కానీ బకాయిలు మాత్రం చెల్లించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని చేనేత సంఘాలు, కూలీలకు కలిపి 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 1.04 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పావలావడ్డీ కింద 17.83 లక్షల బకాయిలు రావల్సి ఉందని కార్మికులు చెబుతున్నారు. నూలుపై ఇచ్చే రాయితీని 35 శాతం కార్మికులు, 5 శాతం చేనేత సంఘాల ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత మిత్ర పథకం మూడేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. సాంకేతిక సమస్యలున్నాయని అధికారులు చెబుతున్నా దీనిపై ఎవరికీ స్పష్టత లేకుండా పోయింది. ఫలితంగా రాయితీ సొమ్ము అందడం లేదని కార్మికులు అంటున్నారు.